రెడ్ల‌కు దూర‌మ‌వుతున్న మంత్రి పెద్దిరెడ్డి... రీజ‌నేంటి?


రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. వైసీపీలోనూ ఆయ‌న త‌న సొంత సామాజిక వ‌ర్గానికి దూర‌మ‌వుతున్నా ర‌నే అభిప్రాయం కనిపిస్తోంది. తాజాగా మంత్రి నారాయ‌ణ స్వామి కూడా ఇవే వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ఈ ప‌రిస్థితికి మ‌రింత బూమ్ వ‌చ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా పెద్దిరెడ్డికి మంచి పేరుంది. ఆయన త‌న సామాజిక వ‌ర్గానికి ఎప్పుడూ అండ‌గా ఉంటార‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇదే ఆయ‌న‌కు చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో పెద్ద ఎస్స‌ర్ట్‌!!

వ‌రుస విజ‌యాల‌తో పుంగ‌నూరులో త‌నకంటూ ప్ర‌త్యేక పునాదులు వేసుకున్నారు పెద్దిరెడ్డి. వైఎస్ హ‌యాం నుంచి కూడా ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు.కానీ, ఎన్న‌డూ లేనిది.. ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గం ఆయ‌నను దూరం పెట్టింద‌నే వార్త‌లు రావ‌డం మాత్రం సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఆయ‌న ద‌ళిత వ్య‌తిరేకి అని, బీసీ వ్య‌తిరేకి అని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓ ద‌ళిత వ్య‌క్తి ఆత్య‌హ‌త్య చేసుకోవ‌డం వెనుక మంత్రి హ‌స్తం ఉంద‌ని.. ఈ కేసును సీబీఐతో విచారించాల‌ని కూడా డిమాండ్ చేశారు. అదేస‌మ‌యంలో ఇసుక‌, గ‌నుల విష‌యంలోనూ మంత్రి దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. ఇక‌, బాబు అందుకుంటే.. త‌మ్ముళ్లు ఫాలో అవుతారు కాబ‌ట్టి.. మిగిలిన నాయ‌కులు కూడా పెద్దిరెడ్డిపై నిత్యం విమ‌ర్శ‌లు చే్స్తూనే ఉన్నారు.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. పెద్దిరెడ్డికి అనుకూలంగా ఏ ఒక్క రెడ్డినేతా మీడియాముందుకు రాలేదు. మంత్రుల్లోకూడా మేక‌పాటి గౌతం రెడ్డి వంటి నాయ‌కులు మౌనం వ‌హించారు. అంద‌రికంటే భిన్నంగా ఉండే.. చంద్ర‌గిరి ఎమ్మెల్యే క‌మ్ ఫైర్‌బ్రాండ్‌.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికూడా ఈ విష‌యంలో మౌనం పాటించారు. ఇక‌, తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అయితే.. పెద్దిరెడ్డి గురించి ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది. ఎందుకు ఇలా మౌనం పాటిస్తున్నార‌నే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక్క‌డి నేత‌లు చెబుతున్న దాని ప్ర‌కారం.. పెద్దిరెడ్డి ఒంటెత్తు పోక‌డ‌ల‌తోనే రెడ్డి సామాజిక వ‌ర్గం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోంద‌ని తెలుస్తోంది.

చిన్న చిన్న కాంట్రాక్టుల‌ను కూడా ఆయ‌న రెడ్డి వ‌ర్గానికి ఇవ్వ‌డం లేద‌ని, ఒక వేళ అడిగినా.. బేరాలు పెడుతున్నార‌ని అంటున్నారు. మొత్తం నియోజ‌క‌వ‌ర్గాన్ని, చిత్తూరు జిల్లాను కూడా ఆయ‌న త‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపిస్తున్నార‌ని, యువ నాయ‌కుల‌కు ప్రోత్సాహం క‌రువైంద‌ని అందుకే రెడ్డి వ‌ర్గం ఆయ‌నపై గుర్రుగా ఉంద‌ని తెలుస్తోంది. జిల్లాలో ఒక్క కుప్పం త‌ప్ప మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించడం వెనుక తానే ఉన్నాన‌నే ప్ర‌చారం చేసుకోవ‌డాన్ని కూడా న‌గిరి ఎమ్మెల్యే రోజా రెడ్డి వంటివారు స‌హించ‌డం లేదు.

పైగా రోజాకు వ్య‌తిరేకంగా కేజే కుమార్‌ను పెద్దిరెడ్డి చేర‌దీశార‌నే ప్ర‌చారం ఉంది. ఎక్క‌డ స‌మావేశం జ‌రిగినా.. అజెండా అంతా త‌నుచెప్పిన‌ట్టే ఉండాల‌ని, ఎవ‌రిని పిల‌వాలో వ‌ద్దో ఆయ‌నే నిర్ణ‌యిస్తున్నార‌ని.. ఇది రెడ్డి వ‌ర్గానికి జీర్ణం కావ‌డం లేద‌ని అందుకే ఆయ‌న‌ను దూరం పెట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా మంత్రి నారాయ‌ణ స్వామి వ్యాఖ్య‌లు రెడ్డి వ‌ర్గం అవ‌లంబిస్తున్న తీరుకు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితి మారాలంటే.. ముందుగా పెద్దిరెడ్డే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.