యండమూరి మాట వింటే.. బాలు బాధ తెలుస్తుంది


బాలు జీవితపు చివరి అంకం విషాదకరంగా ముగియడం ఏ అభిమానికీ ఇష్టం లేదు. నిజానికి బాలుకు కూడా ఇష్టం లేదు. ఏ అనారోగ్యం బారిన పడకుండా.. ఆసుపత్రికి వెళ్లకుండా ప్రశాంతంగా కన్ను మూయాలని కోరుకుంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బాలు. కానీ ఆయన కోరుకున్నట్లు జరగలేదు.

50 రోజులకు పైగా ఆసుపత్రిలో యాతన అనుభవించే ఆయన తనువు చాలించారు. ఈ 50 రోజుల్లో ఆయన ఎంత బాధ అనుభవించి ఉంటాడో లెజెండరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ట్విట్టర్లో ఒక ముఖ్యమైన మెసేజ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. వెంటిలేటర్ పెట్టడం అంటే చాలా చిన్న విషయం అని అంతా అనుకుంటున్నారని, కరోనా గురించి భయపడటం లేదని.. కానీ అందులో ఉన్న కష్టం అంతా ఇంతా కాదు అంటూ అది పెట్టిన వాళ్ల బాధను కళ్లకు కట్టే రీతిలో ఒక పోస్ట్ పెట్టారు.

ప్రభాకర్ రెడ్డి అనే డాక్టర్, ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ చెప్పిన విషయాల్ని కొంచెం సరళీకరించి ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. ఇది చదివాక వెంటిలేటర్ అంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఇంతకీ తన పోస్టులో యండమూరి ఏమన్నారంటే..

‘‘వెంటిలేటర్ అంటే నోటిపై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని రిలాక్స్డ్‌గా పక్క మీద పడుకుని పత్రికలు చదువుకోవటం కాదు. బాధాకరమైన ఇంట్యూబేషన్‌తో ఇది మొదలవుతుంది. నోటి నుండి/ శ్వాసనాళం నుండి కడుపులోకి  గొట్టాన్ని చొప్పించి, ద్రవాహారం ముక్కు ద్వారా లేదా చర్మం ద్వారా శరీరం లోకి పంపిస్తారు. మూత్రాన్ని సేకరించడానికి ఒక పైపు, వ్యర్థం సేకరించడానికి బట్ చుట్టూ ఒక స్టిక్కీ బ్యాగ్, మెడిసన్ ఇవ్వడానికి IV లైను, నిరంతరo బీపీని పర్యవేక్షించడానికి మరో లైన్ శరీరాన్ని బంధించి ఉంటాయి.

ప్రతి రెండు గంటలకు అవయవాలను పునఃస్థాపించడానికి, ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడటానికి చల్లటి ద్రవాన్ని ప్రసరించే బెడ్ మీద పడుకోపెడతారు. రోగి మాట్లాడలేడు, తినలేడు, సహజంగా ఏ పనీ చేయలేడు. తిరిగి మామూలుగా జీవించేవరకూ (లేదా చనిపోయే వరకూ) వెంటిలేటర్ అలాగే ఉంటుంది. ఈ యంత్రం మనిషిని సజీవంగా ఉంచుతుందంతే. 2 నుంచి 3 వారాల వరకూ కదలకుండా ఉండాలి. ఆ అసౌకర్యం మరియు నొప్పి అంతా ఇంతా కాదు.

డాక్టర్లు, నర్సుల బృందాలు, మరియు వ్యర్థం తీసే వర్కర్లు నిరంతం పర్యవేక్షిస్తూ ఉంటారు. రోజుకి తక్కువలో తక్కువ 50 వేల పైగా ఖర్చు అవుతుంది. రోగి కండర ద్రవ్యరాశిని కోల్పోతాడు. నోరు, స్వర తంతుల గాయాలు, పల్మనరీ, గుండె సమస్యలు రావొచ్చు. ఈ కారణంగానే వృద్ధులు, బలహీనంగా ఉన్నవారు చికిత్సను తట్టుకోలేక చనిపోతారు.

మధ్యలో మెలకువ వస్తే ప్రకృతి అందాలు గుర్తొస్తాయి. స్వేచ్చ విలువ తెలుస్తుంది. దాన్ని ఎందుకు దుర్వినియోగ పరచుకున్నామా అని  బాధ, పశ్చాత్తాపం కలుగుతాయి.. ఆత్మీయులు గుర్తొస్తే కంటి చివర నీటి చుక్క. వీలునామా వ్రాయలేదన్న విషయం లీలగా గుర్తు రాబోయే లోపులో మళ్ళీ స్పృహ తప్పుతుంది’’ అంటూ యండమూరి వెంటిలేటర్ బాధల గురించి వివరించారు.

ఇది చదివాక దాదాపు నెలన్నర పాటు బాలు వెంటిలేటర్ మీద ఎంత అవస్థ పడి తనువు చాలించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. కరోనా విషయంలో ఎంతగా భయపడాలో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.