`వైట్ కాల‌ర్` పొలిటీషియ‌న్స్‌‌.. జ‌న‌సేన‌ను ముంచేస్తారా?

వైట్ కాల‌ర్ జాబ్‌.. అంటే విన్నాం.. వైట్ కాల‌ర్ పాలిటిక్స్ ఏంటి? అనే సందేహం వ‌చ్చిందా?  ఒక్కసారి గ‌త ఏడాది ఎన్నిక‌ల సీజ‌న్‌కు వెళ్లండి.. విశాఖ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థిగా.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ చేశారు. అయితే, ఆయ‌న ఎవ‌రిపైనా ఒక్క మాట మాట్లాడ‌లేదు. వివాదాస్ప‌ద వ్యాఖ్య కూడా చేయ‌లేదు. పైగా ప్ర‌జ‌లు కోర‌కుండానే.. వంద రూపాయ‌ల స్టాంపుపేప‌ర్‌పై త‌న‌ను గెలిపిస్తే.. స‌మ‌కూర్చే సౌక‌ర్యాలు, హామీల‌ను పేర్కొని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఇలాంటి నాయ‌కుల‌నే వైట్ కాల‌ర్ పొలిటీషియ‌న్స్ అని.. వారు చేసేవే.. వైట్ కాల‌ర్ పాలిటిక్స్ అని అంటారు. అంటే.. వీరు ఎవ‌రినీ దూషించ‌రు. ఎవ‌రిపైనా.. విమ‌ర్శ‌లు చేయ‌రు.. దూకుడుగా ఉండ‌రు. వివాదాల జోలికి అస్స‌లే పోరు.

అదేస‌మ‌యంలో ఎవ‌రైనా వీరిపై నింద‌లు మోపినా.. దూషించినా.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా.. కౌంట‌ర్ కూడా ఇవ్వ‌రు. ఒక‌వేళ ఇచ్చినా.. ఏసీ రూంలో కూర్చొని వింటున్న ల‌తామంగేష్క‌ర్ మ్యూజిక్‌లా ఉంటుంది. అయితే, ఇప్పుడున్న రాజ‌కీయాల‌కు ఇలాంటి వారు వ‌ర్క‌వుట్ అవుతారా?  పార్టీలు ఇలాంటి వారిని కోరుకుంటాయా? అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. పోక చెక్క‌తోనువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండెంటా! అనే నేత‌ల‌కు ఉండే రేంటింగ్ ఇలాంటి వైట్ కాల‌ర్ నాయ‌కుల‌కు ఉండ‌దు కాబ‌ట్టి. రాష్ట్రంలో పార్టీల‌ను గ‌మ‌నిస్తే..  వైసీపీ, టీడీపీ, బీజేపీలకు దూకుడు ఎక్కువే. ఈ పార్టీల్లోని నాయ‌కులు ప్ర‌త్య‌ర్థుల‌కు బాగానే కౌంట‌ర్లు ఇస్తారు.

ఇక‌, టీడీపీ వైసీపీలైతే.. నువ్వా-నేనా అనే రాజ‌కీయాలు, సంచ‌ల‌నాలు.. వంటివి వాటికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రాజ‌కీయాల్లో ఇలాంటి దూకుడు అవ‌స‌ర‌మా? అనే రేంజ్‌లో ఈ రెండు పార్టీల నేత‌లు రెచ్చిపోవ‌డం మ‌నం నిత్యం చూస్తేనే ఉన్నాం. ప్ర‌జ‌లు ఇలాంటి రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ప్పుడు. దూకుడుగా ఉన్న నేత‌ల‌కే ఓట్లు వేస్తున్న‌ప్పుడు.. పార్టీలు కూడా ఆత‌ర‌హా మార్పులతోనే ముందుకు సాగుతున్నాయి. అయితే, ప్ర‌శ్నిస్తానంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన దూకుడు ఎలా ఉంది? అంటే.. ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం ఆయ‌న ఒక్క‌డే.. అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని ఆక‌ట్టుకునే నేత‌గా మిగిలారు త‌ప్ప మిగిలిన వారంతా కూడా వైట్ కాల‌ర్ నేత‌లుగా ఉన్నార‌ని అంటున్నారు.

ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెడితే.. జ‌నాన్ని ఆక‌ట్టుకునేలా.. పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్లేలా.. ప్ర‌భుత్వంలోని పార్టీకి కానీ, ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న ఇత‌ర పార్టీల‌కు కానీ కౌంట‌ర్లు ఇచ్చే రేంజ్‌లో.. మాస్‌ను ఆక‌ట్టుకునే స్థాయిలో ప‌ట్టుమ‌ని న‌లుగురు కూడా జ‌న‌సేన‌లో క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. నాయ‌కులంతా వైట్ కాల‌ర్ నాయ‌కులేన‌ని చెబుతున్నారు. వారిలో దూకుడు ఉండ‌దు. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దామ‌నే ఆలోచ‌నా లేదు. ఎదుటి పార్టీ నేత‌లు చేసే విమ‌ర్శ‌ల‌కు అంతేదీటుగా కౌంట‌ర్ ఇచ్చే పొజిష‌నూ లేదు. పైగా పార్టీ త‌ర‌ఫున గ‌ట్టిగా వాయిస్ కూడా వినిపించ‌లేక పోతున్నారు.

ఫ‌లితంగా మాస్ ను ఆక‌ట్టుకునే నేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదని ప‌వ‌న్ అభిమానులు పేర్కొంటున్నారు.  నేటి రాజ‌కీయాల్లో మాస్ ఫాలోయింగ్ అత్యంత కీల‌కం. ఎంత‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.. అంత గుర్తింపు. సో.. జ‌న‌సేన‌కు మాస్ నేత‌లు కావాల‌నే డిమాండ్లు క్షేత్ర‌స్థాయిలో వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో వైట్ కాల‌ర్ నేత‌ల‌నే న‌మ్ముకుంటే.. ఎప్ప‌టికైనా పార్టీ ప‌రిస్థితి ఇంతేన‌ని కూడా హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.