కేసీఆర్ కి విజయశాంతి పర్ఫెక్ట్ కౌంటర్

తెలంగాణలో ghmc ఎన్నికలు పలు ఆసక్తికరమైన పరిణామాలకు చిరునామాగా మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ రూపంలో కొత్త రాజకీయ శక్తి బలపడుతోంది. నిన్న స్వామిగౌడ్ టీఆర్ఎస్ నుంచి బీజపీలో చేరారు. రేపు అమిత్ షా సమక్షంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ ఒకపుడు టీఆర్ఎస్ కీలక నేత విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారు. ఈ పరిణామాలే కాదు, తాజాగా ఈరోజు కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సభలో మాట్లాడిన తీరును చూసినా కూడా కేసీఆర్ నెగెటివ్ శకం మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టరు ద్వారా విజయశాంతి సుదీర్ఘమైన కౌంటర్ ఇచ్చారు. అది ఆమె మాటల్లో చదివితేనే బాగుంటుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. ఒక బక్క జీవి అయిన కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం గారు ప్రశ్నించారు. కేసీఆర్ గారి మాటలు వింటుంటే...ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో...
తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ గారు అరిచి గీపెడుతున్నారు.
సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే... దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు.
కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుంది?

- విజయశాంతి

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.