ఆరంటే ఆరు ఓట్ల దూరంలోకి వచ్చేసిన బైడెన్

NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు. మొత్తం 538 ఓట్లకు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థి ఎవరైనా సరే 270 ఓట్లను సొంతం చేసుకుంటే వారికి అధ్యక్ష పీఠం సొంతం అవుతుంది. బుధవారం ఓట్ల లెక్కింపు మొదలైన నాటి నుంచి విజయం ఎవరిదన్న దానిపై విపరీతమైన టెన్షన్ నెలకొంది. అధిక్యతలు తరచూ మారిపోవటంతో.. ఓట్ల లెక్కింపు వ్యవహారం టీ20 మ్యాచ్ ను తలపించింది.

ట్రంప్ కాసేపు అధిక్యంలో ఉండటం.. అంతలోనే బైడెన్ పుంజుకోవటం.. మళ్లీ ఆశలు రేకెత్తించేలా ట్రంప్ కు పరిస్థితులు ఉండటం లాంటి వాటితో తుది ఫలితం ఎలా ఉంటుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తం 55 రాష్ట్రాల ఫలితాలకు తాజాగా 45 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో.. బైడెన్ మొత్తం 264 ఎలక్టోరల్ ఓట్లను సొంతం చేసుకోగా.. ఆయన ప్రత్యర్థి ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే లభించాయి. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి అవసరమైన ఓట్లకు కేవలం ఆరు ఓట్ల దూరంలో బైడెన్ నిలిచి ఉన్నారు. దీంతో.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు దాదాపు దూరమైనట్లేనని చెబుతున్నారు.

అలా అని.. ట్రంప్ కు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. క్రికెట్ మ్యాచ్ లో చివరి బంతి వరకు అవకాశం ఎలా ఉంటుందో.. ఓట్ల లెక్కింపులోనూ అలాంటి పరిస్థితే. ఎందుకంటే.. ఫలితాలు వెల్లడి కావాల్సిన రాష్ట్రాల్లో జార్జియా.. పెన్సిల్వేనియా.. నార్త్ కరోలైనా.. అలస్కా.. నెవడా లలో ఫలతాలు వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ.. ఈ రాష్ట్రాల్లో విజయం మొత్తం ట్రంప్ వశమైతే.. ఒక్క పరుగు తేడాతో ఓడిన చందంగా.. బైడెన్ ఓడేందుకు అవకాశం లేకపోలేదు.

తుది ఫలితంపై మిషిగన్ ప్రభావం ఉంటుందన్న మాటకు తగ్గట్లే.. ఈ ఎన్నికల్లో తొలుత ట్రంప్ అధిక్యతను ప్రదర్శించినప్పటికీ చివర్లో మాత్రం ఫలితం బెడైన్ కు అనుకూలంగా మారటంతో.. ఆయన విజయవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇదే రీతిలో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ట్రంప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అయితే.. అలాంటి అవకాశాలు చాలా  తక్కువని చెప్పక తప్పదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.