భారత్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

రాజ‌కీయాలు ఎక్క‌డైనా రాజ‌కీయాలే. అవ‌కాశం-అవ‌స‌రం..రెండు కోణాల‌ను ఆధారం చేసుకుని సాగే.. పాలిటిక్స్ విష‌యంలో దేశం ఏదైనా.. నాయ‌కులంతా ఒక్క‌టే. తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే అమెరికా లోనూ క‌నిపిస్తోంది. అదికూడా మ‌న దేశం విష‌యంలోనే కావ‌డం.. అందునా.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హార శైలే కావ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. అగ్ర‌రాజ్యం ఎన్నిక‌లకు గ‌డువు స‌మీపిస్తోంది. న‌వంబ‌రు 3న జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ తిరిగి గ‌ద్దెనెక్కేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ ట్రంప్‌ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అందునా.. ఎక్క‌డ వేయాల్సిన తాళం అక్క‌డే వేస్తుండ‌డం మ‌రింత విశేషం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ్లాక్స్ ఓటు బ్యాంకు త‌న‌కు వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని గ్ర‌హించిన ట్రంప్ భార‌తీయ ఓట‌ర్ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు అనేక మార్గాల‌ను వాడుకున్నారు.

భార‌త‌ ప్ర‌ధాని  మోడీ త‌న‌కు అత్యంత స‌న్నిహితుడ‌ని, ఆయ‌న వ్యూహం.. పాల‌న ప‌ద్ద‌తులు ఎన్న‌ద‌గిన‌వ‌ని అనేక వేదిక‌ల‌పై కొనియాడుతూ.. భార‌తీయ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే, ఇంత‌లోనే భారతీయ ఓట‌ర్ల మూడ్‌.. త‌న ప్ర‌త్య‌ర్థి.. జోబైడెన్ వైపు మొగ్గుతోంద‌ని.. త‌మిళ మూలాలు ఉన్న క‌మ‌ల హ్యారిస్ వైపు ఇక్క‌డి భారతీయ ఓటు బ్యాంకు సానుకూలంగా ఉన్న‌ట్టు వార్తా క‌థ‌నాలు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో ట్రంప్ అలెర్ట్ అయ్యారు. వెంట‌నే ఆయ‌న నాలిక మ‌డ‌త‌ప‌డింది.

ఒక్క‌సారిగా భార‌త్‌పై విరుచుకుప‌డ్డారు. చైనా.. భార‌త్ ఒక్క‌టేన‌ని అనేశారు.  ``ఆ రెండు దేశాలు.. దొందు దొందే. ర‌ష్యా కూడా ఈ జాబితాలోదే.`` అని ప్ర‌క‌టించారు. క‌రోనా మ‌ర‌ణాల విష‌యంలో భార‌త్‌కు నిబ‌ద్ధ‌త లేద‌న్నారు.

భార‌త్ కూడా క‌రోనా విష‌యంలో అన్నీ దాస్తోంద‌ని బ‌హిరంగ వేదిక‌పై వ్యాఖ్యానించ‌డం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. అదేంటి నిన్న‌టి వ‌ర‌కు క‌రోనాపై పోరులో భార‌త్ కూడా బాగా ప‌నిచేస్తోంద‌ని, మోడీని అభినందిస్తున్నాన‌ని చెప్పిన ట్రంప్ ఒక్క‌సారిగా ఇలా ప్లేట్ ఫిరాయించారేంట‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

దీనికి కార‌ణం.. స్థానికంగా త‌న‌కు సానుభూతిని మ‌రింత పెంచుకునేందుకు.. అదేస‌మ‌యంలో భార‌తీయుల్లో దాప‌రికం ఎక్కువ‌.. వారిని న‌మ్మ‌కూడ‌దు.. అనేలా వైట్స్‌లో చీలిక తెచ్చేందుకు ట్రంప్ రాజ‌కీయ వ్యూహం మార్చుకున్నార‌ని అంటున్నారు.

ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు నాలిక‌లు మ‌డ‌త‌ప‌డుతూనే ఉంటాయ‌నే దానికి ఇది ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.