ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థకు ఉపాధ్యక్షుడిగా ప్రవాస తెలుగు శాస్త్రవేత్త

NRI

ఏడువేలకుపైగా సభ్యులున్న అంతర్జాతీయ కీటకశాస్త్రవేత్తల సంఘమైన ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఇ.ఎస్.ఏ) లోని ఒక విభాగానికి కాలిఫోర్నియా వాసి, ప్రవాసాంధ్రుడు అయిన  డా. సురేంద్ర దారా ఇటీవలే ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇ.ఎస్.ఏ. లోని నాలుగు విభాగాల్లో ముఖ్యమైన, అతి పెద్దదైన, దాదాపు మూడువేలమంది సభ్యులున్న ప్లాంట్-ఇన్సెక్ట్ ఇకోసిస్టమ్స్ అనే విభాగం యొక్క ఉపాధ్యక్షపదవికి ఎన్నికైన మొదటి తెలుగువాడు, రెండవ భారతీయుడు సురేంద్ర.  ఒక సంవత్సరం ఉపాధ్యక్షపదవిలో, ఆపై అధ్యక్షపదవిలో సురేంద్ర కొనసాగుతారు.

కీటకాలకు, మొక్కలకు మధ్య వుండే పరస్పర సంబంధాల అవగాహన సస్యరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోణాల్లో శాస్త్రీయపరిశొధనలద్వారా విస్త్రుతపరచడంఈ విభాగం ముఖ్య ఉద్దేశ్యం. ఉపాధ్యక్ష హోదాలో ఈ విభాగం యొక్క పురోగతికే కాక పర్యావరణ హితమైన సస్యరక్షణావిధానాల అభివృద్ధికీ, ప్రాచుర్యానికీ కృషిచేస్తానని డా. సురేంద్ర ఈ సందర్భంగా చెప్పారు.  .

కొద్దినెలల క్రితం ఇ.ఎస్.ఏ. లోని పసిఫిక్ శాఖ వారు సమగ్ర సస్యరక్షణలో విశేష కృషిచేసిన వారికిచ్చే "అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటెగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్" పురస్కారాన్ని కూడా సురేంద్ర అందుకున్నారు.  

కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లోని పశ్చిమ భాగాల్లో వుండే సభ్యులతో కూడిన ఇ.ఎస్.ఏ. పసిఫిక్ శాఖలో ఈపురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు సురేంద్ర కావడం విశేషం.  గత సంవత్సరం కూడా ఉత్తమ వ్యవసాయ విస్తరణ చేసినందుకు శాఖా స్థాయిలోనూ, జాతీయస్థాయిలోనూ పురస్కారాలు అందుకున్న మొదటి ఆసియావాసి కూడా సురేంద్ర.

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపురంలో పుట్టి, పెరిగిన సురేంద్ర, రసాయన రహిత, పర్యావరణహిత సస్యరక్షణావిధానాల్లో పాతిక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. రసాయనాలనూ, జీవసంబంధమైన పరిష్కారాలూ మొదలైనవాటిని సమతుల్యంతో వాడే ప్రణాళిక లేదా వ్యూహాన్ని సమగ్ర సస్యరక్షణా విధానం అంటారు.

దశాబ్దాలుగా వున్న ఈ పాత విధానాన్ని ప్రస్తుత ఆర్ధిక, సామాజిక పరిస్థితులకూ పెరుగుతున్న ప్రపంచ జనాభా, మారుతున్న ఆహారపు అలవాట్లు మొదలైన కారకాలకు అనుగుణంగా విస్త్రుతపరచి నూతన సమగ్ర సస్యరక్షణా విధానన్ని ప్రతిపాదించారు సురేంద్ర.  

జర్నల్ ఆఫ్ ఇంటెగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లో గత సంవత్సరం ప్రచురింపబడిన ఈ నూతన విధానం ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణపొందినది. అందరికీ ఆచరణాత్మకంగా, ముఖ్యంగా రైతులకి ఉపయోగపడే విధంగా వున్న ఈవిధానాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రైతులు, విశ్వవిద్యాలయాచార్యులు, వ్యవసాయ పరిశ్రమరంగాల ప్రశంసలను అందుకుంది.  

ఇలాంటి విధానాలను రూపొందించడం, పర్యావరణహిత వ్యవసాయ పరిశోధనలు చేయడం, వాటిని అమెరికాలోనే కాకా, తూర్పు ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని రైతులకు కూడా అందించడం మొదలైనవి ఈ సంవత్సరపు పురస్కారానికి ముఖ్యకారణాలు.  

భారతదేశ వ్యవసాయాభివృద్ధికి కూడా తన పరిశొధనలు ఉపయోగపడలనీ, అందుకుకావలసిన అవకాశంకోసం ఎదురుచూస్తున్నానీ సురేంద్ర అన్నారు.   పర్యావరణహితమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులపై 25 సంవత్సరాలుగా 140 కి పైగా ప్రయోగాలు చేసి, 350 వరకూ పరిశోధనా వ్యాసాలు వ్రాసిన డా.సురేంద్ర ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి వ్యవసాయ, సహజవనరుల విభాగంలో కీటకశాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

తూర్పు ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికాలోని అభివృద్ధిచెందే పలుదేశాల్లోని రైతులకు సమగ్ర సస్యరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై తరచూ శిక్షణనిచ్చే డా.సురేంద్ర దారా, బాపట్ల వ్యవసాయ కళాశాలలోనూ, ఆపై అమెరికాలోని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి, పిదప పశ్చిమాఫ్రికా, కెనడా, అమెరికాలోని పలుప్రాంతాల్లో పనిచేసారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.