వైసీపీలో అంత‌ర్యుద్ధం.. ఎదురుతిరిగిన పెద్దిరెడ్డి శిష్యుడు

చిత్తూరు జిల్లాలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం శ్రీకాళ‌హ‌స్తి. ఇది ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. టీడీపీకి కంచుకోట‌. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్నారెడ్డి ఇక్క‌డ నుంచి అనేక సార్లు విజ‌యం సాధించారు. వ్య‌క్తిగా ఆయ‌న ఇమేజ్‌ను పెంచుకుంటూనే పార్టీని కూడా ప‌రుగులు పెట్టించారు. 2014లో ఆయ‌న విజ‌యం సాధించి.. మ‌ళ్లీ మంత్రి అయ్యారు. అన్నగారి హ‌యాం నుంచి కూడా బొజ్జ‌ల రాజ‌కీయాలు ఇక్క‌డ సాగుతున్నాయి.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేసిన ప్ర‌స్తుత మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. బొజ్జ‌ల‌కు ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో కార్య‌క‌ర్త‌గా ఉన్న బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిని తీసుకువ‌చ్చి.. జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేసి.. దాదాపు రెండేళ్ల ముందుగానే ఆయ‌న ఇక్క‌డ చ‌క్రం తిప్పారు. మొత్తంగా తాను కూడా పెద్దిరెడ్డి చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌చారం చేశారు.

ఇక‌, టీడీపీ త‌ర‌ఫున బొజ్జ‌ల కుమారుడు సుధీర్ రంగంలోకి దిగారు. తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టేందుకు ఈయ‌న కూడా బాగానే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. పెద్దిరెడ్డి వ్యూహం, వైసీపీ హ‌వా ముందు తొలిసారి పోటీ చేసిన సుధీర్ ఓడిపోయారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. పెద్దిరెడ్డి శిష్యుడిగా రంగంలోకిదిగి.. గెలుపు గుర్రం ఎక్కిన బియ్య‌పు మ‌ధు తొలి ఆరేడు మాసాలు గురువు చెప్పిన‌ట్టు విన్నారు. ఆయ‌న ఏం చేయాలంటే.. అదే చేశారు. ఈ క్ర‌మంలోనే కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వ‌సూళ్ల ప‌ర్వం పెరిగిపోయింద‌నే ఫిర్యాదులు వ‌చ్చినా.. ఎమ్మెల్యేకు సెగ‌త‌లుగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపించినా.. ఆయ‌న త‌ట్టుకుని ప‌నిచేశారు. కానీ, అనూహ్యంగా ఏడాది ముగిసేలోగానే బియ్య‌పు మ‌ధు వ్యూహం మార్చేసుకున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై ఉన్న పెద్దిరెడ్డి శిష్యుడు అనే ముద్ర‌ను తొల‌గించేందుకు, వ్య‌క్తిగ‌తంగా తాను దూకుడు పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్న‌ట్టు ప్ర‌య‌త్నం చేస్తూ.. త‌న ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌యోగాత్మ‌కంగా చేసిన ఓ ప‌ని.. బియ్య‌పు మ‌ధుకు రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దానిలో కొంత మేర‌కు విమ‌ర్శ‌లు ఉన్నా.. త‌న ప్ర‌య‌త్నం ఏదో ఒక రూపంలో స‌క్సెస్ అయింద‌నే సంతృప్తి ఆయ‌న‌లో మిగిలింది. దాదాపు వెయ్యి క్వింటాళ్ల బియ్యాన్ని పేద‌ల‌కు పంచే కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా క‌రోనా ఉద్రుతంగా ఉన్న స‌మ‌యంలోనే నిర్వ‌హించారు. దీనివ‌ల్లే .. చిత్తూరులో క‌రోనా వ్యాప్తి పెరిగింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఇక‌, ఆ త‌ర్వాత కూడా అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వీట‌న్నింటినీ కూడా మ‌ధు.. పెద్దిరెడ్డికి తెలియ‌కుండానే.. ముంద‌స్తుగా చెప్పుకుండానే చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో పెద్దిరెడ్డి ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. త‌ను తీసుకువ‌చ్చి.. టికెట్ ఇప్పించి.. గెలుపు గుర్రం ఎక్కిన మ‌ధు స‌హా ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే వెంక‌టే గౌడ.. కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో ఈ ఇద్ద‌రిపైనా ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హంతోనే ఉన్నారు. అయితే.. ఆ ఇద్ద‌రు కూడా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌కోసం పాకులాడుతున్నారు. ఎన్నాళ్లు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ఉంటాం. పార్టీ ముఖ్య‌మే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను కాదంటే ఎలా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వీరికి , పెద్దిరెడ్డికి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గ‌తంగా పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో వీరి వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందోన‌ని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు వైసీపీ నాయ‌కులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.