`అభిమాన`‌మే బాలు.... ప్రాణాలు తీసిందా?

గాన‌గంధ‌ర్వుడు.. రాబోయే త‌రాలు.. కూడా నివ్వెర‌పోయేలా పాట‌కు జీవం పోసిన మ‌ధుర గాయ‌కుడు శ్రీప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తుదిశ్వాస విడిచారు. ఇది ఊహించింది కాదు.. ఈ ప‌రిణామం వ‌స్తుంద‌ని కూడా అనుకోలేదు. కేవ‌లం 45 రోజుల్లో ఆయ‌న ఈ లోకాన్ని వీడుతార‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. కానీ, జ‌రిగిపోయింది. ముందు క‌రోనా బారిన ప‌డ్డ ఆయ‌న త‌ర్వాత దాని నుంచి ఈ నెల 7న కోలుకున్నా.. ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో మెద‌డుకు వెళ్లే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో త‌లెత్తిన లోపాల కార‌ణంగా.. బాలు తుదిశ్వాస విడిచారు. ఇది.. ఇంత‌వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన విష‌యం.

కానీ, ఆయ‌న‌కు క‌రోనా ఎలా సోకింది?  ఎప్పుడో మార్చిలో లాక్‌డౌన్ విధిస్తే.. అప్ప‌టి నుంచి ఇంటిప‌ట్టునే ఉన్న బాలుకు ఆగ‌స్టు 5న పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఎలా క‌నిపించాయి. వైర‌స్ ఎలా సోకింది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చాలా చాలా త‌క్కువ మందికే తెలుసునంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అభిమాన‌మే ఆయ‌న ప్రాణాల‌మీదికి తెచ్చిందంటే.. నివ్వెర‌పోతారు కూడా! పాట‌ల ప్ర‌పంచంలో తీరిక లేకుండా ఉన్న బాలుకు ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా అబిమానులు ఎంద‌రో ఉన్నారు. అయితే, ఆయ‌న వారిని క‌లుసుకునే స‌మ‌యం చాలా త‌క్కువ‌. ఈ క్ర‌మంలో ఎప్పుడు వీలు చిక్కినా.. ఆయ‌న అభిమానుల‌కు చేరువ అవుతూ ఉంటారు.

అభిమాన ధ‌నుడిగా.. తీవ్ర మొహ‌మాట‌స్తుడిగా కూడా ఇండ‌స్ట్రీలో బాలుకు ప్ర‌త్యేక‌త ఉంది. ఇక‌, క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న చెన్నైలో ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు మ‌ద్ద‌తిచ్చారు. పైగా ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌లో నిర్వ‌హించిన క‌రోనా క‌వితల పోటీల‌కు వ‌చ్చిన క‌విత‌ల‌ను ఆయ‌న ఆల‌పించి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేవారు. నిత్యం తాను ఇంట్లోనే ఉంటున్నాన‌ని చెప్పేవారు. అంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని సూచించేవారు. ఇలా సాగుతున్న క్ర‌మంలో కేంద్రం ద‌ఫ‌ద‌ఫాలుగా లాక్‌డౌన్ ఎత్తివేత ప్ర‌క‌ట‌న చేస్తోంది. ఈ క్ర‌మంలో జూలై 15.. బాలు మొబైల్ మోగింది.

బాలుకు అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తి హైద‌రాబాద్ నుంచి ఫోన్ చేసి.. ``బాలూ.. ఇక్క‌డ ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం.. నువ్వు త‌ప్ప‌కుండా రావాలి. నేను మాటిచ్చాను`` అని ఫోన్ పెట్టేశారు. ఆయ‌న గ‌తంలో బాలూకు ఎంతో సాయం చేశారు. ఇద్ద‌రూ క‌లివిడికూడా తిరిగారు. కాద‌న‌లేరు. ఏం చేయాలి?  ఒక ప‌క్క చెన్నైనే కాదు.. హైద‌రాబాద్‌ను కూడా క‌రోనా కుదిపేస్తోంది. ఈ విష‌యంలో ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా  స‌ల‌హా కోరారు. ఆయ‌న వ‌ద్దు.. హైద‌రాబాద్ ప‌రిస్థితి బాగోలేదు.. అని సూచించారు.

అయిన‌ప్ప‌టికీ.. స్నేహితుడి కోసం.. ఆగ‌స్టు 2, 3 తేదీల్లో హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన రెండు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని గ‌ళం వినిపించారు బాలు. క‌ట్ చేస్తే.. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారిలో ఆర్కెస్ట్రా సిబ్బంది మొత్తానికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక‌, 4వ తేదీ చెన్నై చేరుకున్న బాలుకు కూడా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో ఆయ‌న ఇంటికి కూడా వెళ్ల‌కుండానే.. నేరుగా ఎంజీఎం ఆసుప‌త్రికి చేరుకుని.. అటు నుంచి అటే.. గంధ‌ర్వ లోకానికి వెళ్లిపోయారు. ఈ విష‌యం తెలిసిన అతి త‌క్కువ మంది.. అభిమాన‌మే.. బాలు ప్రాణాల మీద‌కు తెచ్చింది! అని మ‌ధ‌న‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.