బీజేపీ పతనానికి గట్టి పునాదులేస్తున్న సోము వీర్రాజు


కొత్త అధ్యక్షుడు రాగానే పార్టీకి జవసత్వాలు వస్తాయని ఆశించిన చాలామంది సీనియర్లకు నిరాశే ఎదురవుతున్నట్లుంది. బిజెపికి కొత్త రథసారధిగా సోమువీర్రాజు బాధ్యతలు స్వీకరించినపుడు చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. పార్టీలో అత్యంత సీనియర్లలో ఒకరైన వీర్రాజుకే పార్టీ పగ్గాలు అప్పగించటంతో ఇక ఒరిజినల్ కమలనాథులంతా యాక్టివ్ అయిపోతారని అందరు అనుకున్నారు. కానీ పార్టీలోనే కాకుండా బయట కూడా సీన్ రివర్సులో నడుస్తున్నట్లు సమాచారం. దాంతో సోము రాజకీయం ఏమిటో అర్ధంకాక సీనియర్లలో చాలామంది అయోమయానికి గురవుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి వీర్రాజు ప్రధానంగా కాపు సామాజికవర్గంలోని నేతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు నేతల్లోని కొందరితో వీర్రాజు ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారట.

వీర్రాజు వాలకం చూసిన తర్వాత బిజెపి వైపు కాపులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. లక్ష్యం మంచిదే కానీ ఈ ప్రయత్నం వల్ల మిగిలిన సామాజికవర్గాలు పార్టీకి దూరమయ్యే ప్రమాదాన్ని వీర్రాజు మరచిపోయినట్లున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో కాపులకు-బిసిలకు, కాపులకు-ఎస్సీలకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపార్టీ అయినా కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రహిస్తే పై రెండు సామాజికవర్గాలు సదరు పార్టీకి వ్యతిరేకం అయిపోతాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పాటు జనసేన కూడా దెబ్బతిన్నది ఇందుకే. కాపులను ఎంత మోసినా చంద్రబాబు పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిగా తయారైంది.

కాపులకు రిజర్వేషన్లు అనగానే ఇటు బిసిలు వ్యతిరేకం అయ్యారు. కేంద్రం సహకారం లేకపోవడంతో రిజర్వేషన్లు అమలు చేయకపోవటంతో అటు కాపులూ దూరమయ్యారు. మిగతా మేళ్లు కూడా వారు పట్టించుకోకుండా బాబును దూరం పెట్టారు.

సరిగ్గా ఇదే పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి లబ్దిపొందారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని స్పష్టంగా జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనతో ముందుగా కాపుల్లో ఆగ్రహం వచ్చినా... జగన్ ట్రాప్ లో పడి అతను రగిలించిన కుల జ్వాలలో రగిలిపోయి  వైసిపికి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో కాపులపై తెలుగుదేశం పెట్టిన శ్రద్ధ వల్ల దశాబ్దాల పాటు టిడిపినే అంటిపెట్టుకున్న బిసిలు కూడా వైసిపికి మద్దతుగా నిలబడ్డారు.

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కష్టమో నష్టమో ప్లెయిన్ గా ఉంటేనే జనాలు ఆధరిస్తారు. మొన్నటి ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో బిజెపి తరపున పోటి చేసిన ఎవరికి కూడా డిపాజిట్లు కూడా రాలేదు. తన కళ్ళముందే జరిగిన విషయాలను మరచిపోయి మళ్ళీ వీర్రాజు కాపులనే భుజాన మోయటం ఏమిటని పార్టీలోని నేతల్లోనే చర్చ మొదలైంది.
జాతీయస్ధాయిలో బిజెపికి అన్నీ వర్గాలు మద్దతుగా నిలబడటంతోనే కమలంపార్టీ మంచి మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీర్రాజు పార్టీని అన్నీ వర్గాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తేనే  ఏమన్నా ఉపయోగం ఉంటుంది. అసలు ఏపి వరకు సామాజికవర్గాలను నమ్ముకునో లేకపోతే మత రాజీకీయాలు చేసో లబ్దిపొందిన పార్టీ లేదనే చెప్పాలి.

ఎక్కడో ఓ నియోజకవర్గంలో ఎవరైనా లబ్దిపొందితే పొందుండచ్చు. అదికూడా మెజారిటిని పెంచటానికి ఉపయోగపడుతుందే తప్ప అచ్చంగా గెలిపించటానికి మత, కుల రాజకీయాలు ఉపయోగపడవు. ఎందుకంటే అన్నీ కులాలు, మతాల వాళ్ళు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.