సంచ‌యిత ఇంత ముదుర‌నుకోలేదే!.. విజ‌య‌న‌గ‌రం టాక్‌

సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు. ఇటీవ‌ల కాలంలో ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన నాయ‌కురాలు. మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్‌గా, సింహాచ‌లం అప్ప‌న్న ఆల‌య బోర్డు చైర్ ప‌ర్స‌న్‌గా రాత్రికి రాత్రి తెర‌మీదికి వ‌చ్చిన సంచ‌యిత‌.. తీవ్ర సంచ‌ల‌నం సృష్టించారు. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌న రాజ‌కీయ క్రీడ‌లో వాడుకున్న పావుగా సంచ‌యిత‌ను టీడీపీ నేత‌లు అభివర్ణిస్తారు.  సంచ‌యితా గ‌జ‌ప‌తిరాజు దూకుడుపై విజ‌య‌న‌గ‌రంలో ఇప్పుడు అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టే వ్యూహంలో భాగంగా జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌యిత‌ను పావుగా వాడుకున్న విష‌యం తెలిసిందే.

కొన్నాళ్ల కింద‌టే కాదు.. ఇప్ప‌టికీ.. ఇది వివాదంగానే ఉంది. ప్ర‌స్తుతం ఆమె చేప‌ట్టిన రెండు ప‌ద‌వుల‌పైనా  కేసు కోర్టులో న‌డుస్తోంది. ఇదిలావుంటే.. సంచ‌యిత‌.. తాజాగా చేసిన ఓ ప‌ని.. ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.  పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం అనేది గ‌జ‌ప‌తుల వంశ‌పారంప‌ర్య‌కార్య‌క్ర‌మం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు నిర్వ‌హించారు. అయితే, ఇప్పుడు మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న సంచ‌యిత ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఆనంద గ‌జ‌ప‌తి రాజు కుటుంబాన్ని  జిల్లా అధికారులు ఆహ్వానించారు.

దీంతో ఆనంద గ‌జ‌ప‌తిరాజు రెండో భార్య‌, వీరి పుత్రిక ఊర్మిళ‌లు ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. ఆన‌వాయితీ ప్రకారం.. వీరికి గ‌జ‌ప‌తుల కోట‌పై ఆస‌నాలు ఏర్పాటు చేశారు. ఊర్మిళ‌, ఆమె త‌ల్లి కూడా అక్క‌డ కూర్చొని వీక్షిస్తున్నారు. ఈ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన సంచ‌యిత‌.. వీరు కూర్చున్న కుర్చీల‌ను ఖాళీ చేయించాలంటూ.. ప‌క్క‌నే ఉన్న డీఎస్పీని ఆదేశించారు.  కొద్ది సేప‌టికి ఊర్మిళ‌.. ఆమె త‌ల్లి.. అక్క‌డ నుంచి నిష్క్ర‌మించిన త‌ర్వాత సంచ‌యిత కూర్చోన్నారు. కానీ, ఈ విష‌యం అప్ప‌టికే సోష‌ల్ మీడియాకు ఎక్కేసింది. దీంతో సంచ‌యితకు ఇంత దూకుడు అవ‌స‌ర‌మా? అనే స‌టైర్లు వెల్లువ‌లా దూసుకు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. గ‌జ‌ప‌తుల కుటుంబం నుంచి సంచ‌యితకు పోటీగా ఊర్మిళ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. సంచ‌యిత ప్ర‌స్తుతం బీజేపీలో ఉంటూ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఊర్మిళ‌.. టీడీపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.