సజ్జల కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారా?

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన ఏపీ హైకోర్టు.. రేపో మాపో.. పార్టీ కీల‌క నేత‌, ఏకంగా సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై గురి పెట్టిందా?  స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను హైకోర్టు సీరియ‌స్‌గా భావిస్తోందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. స‌జ్జ‌ల మీడియా ముందుకు వ‌చ్చార‌ని కానీ, ఆయ‌న రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంపై మీరు(హైకోర్టు) వ‌ద్ద‌ని చెప్పినా.. మీడియాతో మాట్లాడార‌ని కానీ...  ఎవ‌రూ హైకోర్టుకు చెప్ప‌లేదు. కానీ, ఈ వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు ఒకింత సీరియస్ గా‌నే స్పందించింది.

రాజధాని భూముల వ్యవహారంలో ఏసీబీ గత నెల 15వ తేదీన నమోదు చేసిన కేసు ఎఫ్‌ఐఆర్‌ వివరాలు వెలువరించరాదంటూ హైకోర్టు ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసింది. మాజీ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాలపాటి శ్రీనివాస్‌ స‌హా మ‌రికొంద‌రు కీల‌క వ్య‌క్తుల‌పై ఏసీబీ కేసు న‌మోదు చేయ‌డాన్ని నిలిపి వేయాల‌ని కూడా హైకోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. ఈ విష‌యాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌న‌ర‌ల్ మీడియా, సోష‌ల్ మీడియాల్లోనూ వెల్ల‌డించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. కానీ, త‌దుప‌రి రోజే.. స‌జ్జల మీటింగ్ పెట్టి.. ఆయా కేసుల వివ‌రాల‌ను న‌ర్మ‌గ‌ర్భంగా మీడియా ముందు వెల్ల‌డించారు. ఈ కేసు విచారిస్తే.. నిందితులు బ‌య‌ట‌కు వ‌స్తారంటూ.. ఆయ‌న నిందితుల పేర్లు కూడా ఉటంకించారు.

తాజాగా ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు...  తాము ఇచ్చిన ‘గ్యాగ్‌’ ఉత్తర్వులు.. సీఎం సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంతో నిష్ఫలమయ్యాయని  వ్యాఖ్యానించింది. అంటే.. ప‌రోక్షంగా ఆయ‌న కోర్టు ధిక్కార చ‌ర్య‌లకు పాల్ప‌డ్డార‌నే భావ‌న‌ను హైకోర్టు వ్య‌క్తీక‌రించింది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రైనా ఇప్పుడు ఈ విష‌యంపై హైకోర్టులో పిటిష‌న్ వేస్తే.. విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, వెంట‌నే స‌జ్జ‌ల‌పై చ‌ర్య‌ల‌కు హైకోర్టు సిద్ధ‌ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బ‌ట్టి.. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఏకేసిన వారికంటే కూడా స‌జ్జ‌ల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌లు ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఇక‌, స‌జ్జ‌ల వారి వంతు వ‌చ్చేసింద‌న్న‌మాట‌! అనే టాక్ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.