బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు మీద రేప్ కేసు

తరచూ బాలీవుడ్ సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న సంచలన ఉదంతాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటికి మొన్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య షాకింగ్ గా మారటమే కాదు.. ఆ వ్యవహారం తిరిగి తిరిగి డ్రగ్స్ కేసుల వరకు వెళ్లటం.. సంచలన అంశాలు తెర మీదకు రావటం తెలిసిందే. మధ్యలో కంగనా ఎపిసోడ్ ఒకటి.

తాజాగా ఊహించని రీతిలో ఒక స్టార్ హీరో కొడుకు మీద సంచలన ఆరోపణలు రావటమే కాదు కేసు నమోదు కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ లో సంచలన హీరోగా వెలిగిపోవటమే కాదు.. ఇప్పటికి తన సత్తా చాటే స్టార్ నటుడు  మిధున్ చక్రవర్తి కుమారుడు మీద రేప్ కేసు నమోదైంది. మిధున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ చక్రవర్తి మీద గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల క్రితం భోజ్ పురి నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని.. అనంతరం అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. ముంబయికి చెందిన యువతి ఒకరు మహాక్షయ మీద తాజాగా కంప్లైంట్ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. చివరకు మోసం చేసినట్లుగా మహాక్షయ మీద ముంబయిలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది. నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని.. శారీరకంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆమె ఆరోపించారు.

మహాక్షయ కారణంగా తాను గర్భం దాలిస్తే.. బలవంతంగా తనకు అబార్షన్ చేయించినట్లుగా బాధిత యువతి ఆరోపించింది. తనను మహాక్షయ తల్లి సైతం బెదిరించారని.. కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయనట్లుగా ఆమె పేర్కొన్నారు. సదరు యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. రానున్న రోజుల్లో బాలీవుడ్ లో ఈ ఉదంతం మరో సంచలనంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.