ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్!

నందమూరి తారకరామారావు.. ఆచంద్రతారార్కం తెలుగు ప్రజల గుండెల్లో విరా జిల్లే ఆరాధ్యమూర్తి... వెండితెర చరిత్రలో అజరామరమైన ఆయన నటనా ప్రస్థానం మనందరికీ తెలుసు. ఆ యుగపురుషుడి రాజకీయ జీవితం అందరికీ ఎరుకే. కానీ ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు, పద్మజ దంపతులు. ఎన్టీఆర్‌ అరుదైన ఆ సంఘటన గురించిన విశేషాలివి..!
జూలై 7, 1988... ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం... ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. ఆ ప్రదేశమంతా పది వేల మంది జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ క్షణం అందరి కళ్లు ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. వారంతా వధూవరుల బంధుమిత్రులు కారు. ఆ పెళ్లికి అతిథిగా హాజరవుతున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును కనులారా చూసిపోదామని అక్కడికి విచ్చేసిన జనవాహిని. ముహూర్తం సమయం ఆసన్నమైంది. అన్నగారు వివాహ మండపంలోకి అడుగుపెట్టారు. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ నాగభైరవ కోటేశ్వరరావు (పెళ్లికొడుకు తండ్రి)ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు.
అంతే... అక్కడ సీన్‌ మొత్తం మారింది..
అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబోతోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు.
ఆ గంట ఏం జరిగిందో గుర్తులేదు..!
ఎన్టీఆర్‌ తన వివాహానికి స్వయంగా పౌరహిత్యం చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ విశేషాలను నాగభైరవ వీరబాబు గుర్తుచేసుకున్నారు. ‘‘మా నాన్న నాగభైరవ కోటేశ్వరరావు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో 60 రోజులు కలిసి ఉన్నారు కూడా. సాహిత్యాభిలాషి, తెలుగు భాషా ప్రేమికుడైన ఎన్టీఆర్‌ మా నాన్నను ప్రేమగా ‘కవిగారు’ అని పిలిచేవారు. ఆయనపై ఉన్న ఆత్మీయతతో ఆహ్వానించగానే నా పెళ్లికి విచ్చేశారు. అప్పుడు మా జిల్లా కలెక్టరుగా డా. జయప్రకాశ్‌ నారాయణ ఉన్నారు. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తే చాలనుకునేవాళ్లం. అలాంటిది ఆయనే స్వయంగా నా పెళ్లి జరిపిస్తుండటంతో ఆ సమయంలో ఏదో తెలియని భావన నాలో కలిగింది.
ఆ తన్మయత్వంలో గంటసేపు ఏం జరిగిందో కూడా గుర్తులేదు (నవ్వులు..)’’ అన్నారాయన. ఆ రోజు సంఘటనను వీరబాబు సతీమణి పద్మజ గుర్తు చేసుకుంటూ ‘‘అప్పుడు నాకు 19 ఏళ్లు. కళ్యాణ మంటపం మీద మేమిద్దరం, తాతయ్య, ఎన్టీఆర్‌... అంతే. ఇంకెవ్వరినీ అనుమతించలేదు. వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. ‘ఆ! మేలగాళ్లు కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. ఆయన పురోహితుడుగా వ్యవహరించిన తొలి, తుది పెళ్లి మాదే కావడం మాకు దక్కిన అదృష్టం’’ అన్నారామె.
కవిరాజు ‘వివాహ విధి’
త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు. సప్తపది, జిలుకర బెల్లం, మంగళసూత్రధారణ పవిత్రను, పరమార్థాన్ని వివరించి పెళ్లితంతు జరిపారు. అనంతరం వేదిక కింద ఉన్న అతిధులంతా అక్షితలను వధూవరులపైకి విసురుతున్నారు. అప్పుడు ‘‘మనమంతా అక్షింతలు అంటాం. కానీ అక్షితలు అనాలి. వాటిని వధూవరులపై దయచేసి అలా విసరకండి. ఒక్కొక్కరుగా వచ్చి నిండు మనస్సుతో నవ దంపతులను ఆశీర్వదించండి.!’’ అని సూచించారు. ఎన్టీఆర్‌ 45 నిమిషాల పాటు మండపంపై ఆశీనులై కళ్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని, దానివెనుకున్న పరమార్థాన్ని వివరిస్తూ పౌరహిత్యం చేశారు.
ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు పాత్రికేయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏవీఎస్‌ (తర్వాత హాస్యనటుడుగా గుర్తింపు పొందారు)ఆ వార్తను రాశారు.
ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా విన్నవిస్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.