మారటోరియం వాడుకున్నోళ్లకు ఊరట?

లాక్‌డౌన్ టైంలో అందరి పరిస్థితీ తల్లకిందులైన నేపథ్యంలో బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకుని ఈఎంఐలు కట్టే వారికి కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మారటోరియం అమలు చేసిన సంగతి తెలిసిందే. ముందు మూడు నెలల పాటు ఈఎంఐలు వాయిదా వేసుకునే అవకాశం కల్పించిన కేంద్రం.. ఆ వ్యవధిని తర్వాత ఇంకో మూడు నెలలకు పొడిగించింది.

చేతిలో డబ్బుల్లేని వాళ్లందరూ మారటోరియం ఆప్షన్ ఎంచుకోగా.. మేనేజ్ చేయగలిగిన వాళ్లు మాత్రం మారటోరియం సందర్భంగా ఆగిన ఈఎంఐల మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్‌లో కలిపి దానికి వడ్డీ వేయడం వల్ల చివర్లో ఈఎంఐలు పెరిగి భారమవుతుందన్న ఉద్దేశంతో ఈఎంఐలు కట్టేశారు. ఐతే మారటోరియం అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి ఇలా భారం మోపడం పట్ల కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి.

మారటోరియంలో ఆగిన ఈఎంఐలకు వడ్డీ వేయకుండా చూడాలని పిటిషనర్లు కోరగా.. దీనిపై కొన్ని నెలలుగా సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.ఐతే మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులకు చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని.. ఆర్థిక  మూల సూత్రాలకు అది విరుద్ధమని.. కష్టపడి ఈఎంఐలు కట్టిన వాళ్ల పరిస్థితేంటని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.

కానీ సుప్రీం కోర్టు వేసిన అనేక ప్రశ్నలు, లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ వైఖరిని మార్చుకుంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ చేయడానికి తాము సుముఖమే అని తెలిపింది. ఐతే మొత్తం అన్ని రకాల రుణాల మీదా వడ్డీ మాఫీ చేయాలంటే ఏకంగా రూ.6 లక్షల కోట్ల భారం పడుతుందని.. కాబట్టి రూ.2 కోట్ల లోపు రుణాలకు మాత్రమే వడ్డీ మాఫీ చేయగలమని స్పష్టం చేసింది.

ఇది కోట్లాది మందికి ఊరట కలిగించే విషయమే. ముఖ్యంగా ఇంటి కోసం, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న మధ్య తరగతి జీవులకు ఇది గొప్ప ఉపశమనాన్నిచ్చే విషయమే. కానీ భవిష్యత్తులో పడే వడ్డీ భారం మోయలేమన్న ఉద్దేశంతో ఎలాగోలా కష్టపడి మారటోరియం తీసుకుని ఈఎంఐలు కట్టిన వాళ్ల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.