కట్టు తెంచేశారు.. కరోనా పెంచేశారు!

కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా

వైసీపీ నేతల మూక కార్యక్రమాలు

అట్టహాసంగా ఆహారం, పండ్ల పంపిణీలు

జససందోహంతో ప్రారంభోత్సవాలు

ఊరూవాడా వైఎస్‌ జయంతి ఉత్సవాలు

వాటిని అడ్డుకోకుండా పోలీసుల చోద్యం

చాలా చోట్ల కార్యకర్తలకు, పోలీసులకు వైరస్‌

ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సైతం

హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్న నేతలు

వారిలో ప్రథముడు విజయసాయిరెడ్డి

కరోనా కట్టడిలో అధికారపక్షంగా కీలక పాత్ర పోషించాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు తద్విరుద్ధంగా ప్రవర్తించారు. కట్టు తెంచేసి ఊరూరా కరోనాను పెంచేశారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మూడడుగులు దూరం పాటించాలని.. విధిగా మాస్కులు ధరించాలని కేంద్రం, రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీచేశాయి. అనవసరంగా బయటకు రావద్దని ఆంక్షలు విధించాయి. వాహనాల రాకపోకలను నిలిపివేశాయి.

ఇతర దేశాలకు సైతం విమానాలను ఆపేశారు. కానీ రాష్ట్రంలో వైసీసీ నేతలకు పట్టపగ్గాలు లేవు. కరోనా బాధితులకు, వలస కూలీలకు ఆహారం, పండ్ల పంపిణీ పేరుతో ఆర్భాటం చేశారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావడం.. ర్యాలీలు చేపట్టడం, సభలు నిర్వహించడం, సమావేశాలు పెట్టడం చేశారు.

వారిని అడ్డుకోగల పోలీసు అధికారులే లేకపోయారు. దీంతో వైసీపీ కార్యకర్తలకు, సామాన్యజనాలకు, పోలీసులకు సైతం కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల్లో ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్‌లో  అధికార పక్షం నేతల తీరు వల్ల..మారుమూల గ్రామాలకూ పాకింది. కట్టుదాటి వ్యవహరించిన కొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు హోం క్వారైంటైన్‌లో, ఐసోలేషన్‌లో తలదాచుకుంటే.. ఇంకొందరు మాత్రం బాహాటంగానే తిరుగుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినన తొలినాళ్లలో ఒకటి  రెండు కేసులు వస్తేనే ప్రజల్లో భయం కనిపించేది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిరోజూ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌,  వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితరులతో సమీక్షలు నిర్వహించేవారు.

ఈ ఏడాది మార్చి 22న ప్రధాని మోదీ జాతీయ స్థాయిలో జనతా కర్ఫ్యూకు పిలుపును ఇచ్చారు. మార్చి 23 నుంచి జగన్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులే కాకుండా జిల్లాల సరిహద్దులూ మూసేశారు. ఈ సమయంలో ప్రజలకు ఆహార సదుపాయాలు అందించే మిషతో అధికారపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో పోటీ పడి మరీ పంపిణీకి సిద్ధమయ్యారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో జనం పాల్గొన్నారు. గుమిగూడి ఒకేచోటకు చేరారు. అప్పట్లో ఇవి విమర్శలకు దారి తీశాయి. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. అయినా అధికారపక్ష నేతలు వాటిని పట్టించుకోలేదు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సభ్యుల ప్రమాణ స్వీకారాలూ జరిగాయి.

వాటికి జనసమీకరణ బాగా చేశారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఈ మార్కెట్‌ కమిటీ బాధ్యతల స్వీకరణ కారణంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా సామాజిక వ్యాప్తి స్థాయికి చేరింది. కరోనా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్న సమయంలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా అధికారపక్షం నిర్వహించింది. భారీ స్థాయిలో కేకులను కట్‌ చేసి ఆనందంగా అధికారపక్ష నేతలు ఒకరి నోట్లో మరొకరు పెట్టుకున్నారు.

ఇలా ఏదో కారణంతో సామూహిక కార్యక్రమాలను చేపట్టడంతో రాష్ట్రం ఇప్పుడు కరోనా వ్యాప్తిలో మూడో స్థానంలో ఉంది. గతంలో రోజువారీ సమీక్షలు నిర్వహించిన జగన్‌.. ఇప్పుడు కరోనాపై గుర్తుకొచ్చినప్పుడు జరుపుతున్నారు. ఈ వైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని క్రమం తప్పకుండా చెబుతున్నారు.

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని.. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని.. క్వారంటైన్‌సెంటర్‌లలో సదుపాయాలు కల్పిస్తున్నామని, పరీక్షల్లో ముందున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు సరిగా జరగడం లేదు. డాక్టర్లు అక్కడకు రావడమే లేదు. ముఖ్యమంత్రే అధికారిక కార్యక్రమాల్లో మాస్కులు ధరించడం లేదు. ఇక మిగతా మంత్రులు మాత్రం పాటిస్తారా? అంబులెన్సుల ప్రారంభోత్సవంలో ఆరోగ్య మంత్రే మాస్కు వేసుకోలేదు.

భాథ్యతారాహిత్యం..

ఓట్ల రాజకీయాలతో జనాన్ని కరోనాబారిన పడేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ వ్యాధి సోకి విలవిలలాడుతున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసే ప్రక్రియలో భూములపై కన్నేసిన ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్ఠవేసి వీదివీధినా తిరిగారు. ఉత్తరాంధ్ర మొత్తం పర్యటించారు. వందల మందితో సమావేశాలు ఏర్పాటు చేశారు. చివరకు ఆయనకే కరోనా సోకింది.

అప్పటికప్పుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎంతో మందిని కలిసి ఉంటారు.. వారందరి పరిస్థితేంటి? విశాఖలో ఇప్పుడు కరోనా కేసులో భయంకరంగా పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం వరకు ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం, విజయనగరం ఇప్పుడు మిగతా జిల్లాలతో సమానంగా దూసుకెళ్తున్నాయి.

కడప జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కరోనా బారిన పడ్డారు. మొదట తిరుపతిలో చికిత్స తీసుకున్నారు. అక్కడి ఏర్పాట్లకు ఠారెత్తి రాత్రికిరాత్రి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. విద్యుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్‌ చెక్కేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు అందడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కదుబండి శ్రీనివాస్‌కు పాజిటివ్‌ అని తేలింది. ఆయన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొన్నారు.

జూన్‌ 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు. ఆయనతో తిరిగిన ఎమ్యెల్యేలు .. ఆయన కలిసిన మంత్రులు ఆందోళన చెందారు. వారందరినీ గుర్తించి వైద్య సాయం చేసేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కరోనా వచ్చినట్లుగా ప్రకటించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేశ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే ఎం.సుధాకరరావుకు పాజిటివ్‌ వచ్చింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, ఆయన చిన్నాన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి.. మండపేట, పి.గన్నవరం ప్రజా ప్రతినిధులు, రాజమండ్రి ఎంపీ గన్‌మెన్‌కు కరోనా వచ్చిందన్న ప్రచారం ఉంది.

గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు పాజిటివ్‌ వచ్చింది.. ఇక గుంటూరు వన్‌ ఎమ్మెల్యే ముస్తాఫా హోం క్వారంటైన్‌లోకి  వెళ్లారు. ఆయన ఇంట్లో 15 మందికి కరోనా సోకినట్లు ప్రచారం ఉంది. ఆయన పెద్దఎత్తున వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో గుంటూరు నగరంలో వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది.

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కూడా తమ వంతుగా కరోనా వ్యాప్తికి సహకరించి దానిబారిన పడ్డారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.