కంగనకు రాని నోటీసులు దీపికకు రావడం వెనుక

ఒక యువనటుడు ఆత్మహత్య చేసుకోవటం.. బాలీవుడ్ కు శాపంగా మారిందా? అతడి మరణానికి కారణం ఏమిటన్న విషయాన్ని తవ్వి తీసే క్రమంలో డ్రగ్స్ ఉదంతం తెర మీదకు రావటం.. తదనంతరం సంచలన అంశాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి.

తొలుత నెపోటిజం చుట్టూ తిరిగిన ఈ వ్యవహారం.. అనంతరం అతడి మరణానికి కారణంగా సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టూ తిరటం.. ఆమె చెప్పిన సమాచారంతో విషయం డ్రగ్స్ వైపుకు వెళ్లటం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లకు నోటీసులు పంపటం తీవ్ర సంచలనంగా మారింది. శ్రద్దా కపూర్.. సారా అలీఖాన్.. రకుల్ తదితర సినీ తారలకు నోటీసులు అందాయి.

అధికారుల నోటీసుల్ని అందుకున్న వారంతా  ఇప్పుడు ముంబయికి చేరుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్యవహారంలోకి అగ్ర కథానాయికి దీపికా పదుకునే పేరు బయటకు రావటం.. ఆమెకు నోటీసులు ఇవ్వటం షాకింగ్ గా మారింది. దీపికకు నోటీసులు ఇచ్చిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించటం కోసమే డ్రగ్స్ కేసును తెర మీదకు తెచ్చినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.

దీపిక నోటీసుల వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశ వ్యాప్తంగా రైతు సంఘాల వారు బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో సహా పలువురు పేర్లను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. దీపిక పేరు రావటం వెనుక రాజకీయ అంశాలు ఉన్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పెద్దలు వేసిన వ్యూహంలో భాగంగానే దీపిక పేరు తెర మీదకు తీసుకొచ్చారన్న మాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

దీపికకు నోటీసుల వెనుక అసలుకారణం వేరే ఉందని.. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్ యూలో విద్యార్థులు.. టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ అప్పట్లో వర్సిటీని సందర్శించటం గుర్తుండే ఉంటుంది. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు.. బీజేపీకి మింగుడుపడనిదిగా మారినట్లుగా చెబుతారు. బీజేపీ మద్దతుదారులు జరిపిన దాడికి నిరసనగా కొన్ని విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలపటం అప్పట్లో పెద్ద చర్చను లేవనెత్తింది.

తాజాగా జారీ చేసిన నోటీసులు వెనక.. నాటి జేఎన్ యూ ఉదంతాన్ని మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు కమలనాథులు పాల్పడుతున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా సీనియర్ నటి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నగ్మా వ్యాఖ్యలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని.. మరి కంగనా పేరు ఎందుకు రావటం లేదన్నది ఆమె ప్రశ్న.

తనకు తానే ఒక టీవీ షోలో డ్రగ్స్ కు బానిసగా మారినట్లుగా కంగనా పేర్కొన్న విషయాన్ని నగ్మా గుర్తు చేశారు. అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్టు చేయన్న ఆమె.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా ఉందన్నారు.

ఇదంతా చూస్తుంటే.. తప్పు చేసినా సరే.. కేంద్రానికి దన్నుగా నిలిచే వారిపై ఎలాంటి చర్యలు ఉండవన్న విషయాన్ని చేతలతో చెప్పినట్లుగా ఉందంటూ ఆమె వ్యంగ్యస్త్రాల్ని సంధిస్తున్నారు. ఈ వాదన ఇప్పుడు వైరల్ గా మారింది. చూస్తుంటే.. బాలీవుడ్ డ్రగ్స్ వివాదం అంతకంతకూ రాజుకోవటమే కాదు.. ఇదంతా ఇప్పుడు ఎక్కడి వరకు వెళుతుందన్నది అంతుచిక్కనిదిగా మారిందని చెప్పక తప్పదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.