కేసీఆర్‌ ... మ‌ంత్రులు మారాలా? మీరు మారాలా?

తెలంగాణ అధికార పార్టీలో మంత్రివ‌ర్గ మార్పుపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ ఓట‌మి.. త్వ‌ర‌లో రానున్న‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని.. ప‌నిచేయ‌ని మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు వార్త‌లు తెర‌మీది కి వ‌చ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి మార్పులు అవ‌స‌రం? ఎవ‌రు మారాలి? అనే చ‌ర్చ సాగుతోంది.

మంత్రుల‌ను మార్చుకుంటూ.. పోతే.. ప‌రిస్థితులు అనుకూలంగా మార‌తాయా?  లేక .. ప్ర‌భుత్వాధినేతగా ఉన్న కేసీఆర్ మైండ్ సెట్ మారితే ప‌రిస్థితులు టీఆర్ ఎస్‌కు సానుకూలం అవుతాయా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

సాధార‌ణంగా.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోందంటే.. స‌ర్కారును న‌డిపేవారు బాధ్య‌త తీసుకోవ ‌డం చాలా అరుదుగా క‌నిపిస్తుంది. గ‌తంలో ఏపీలోనూ చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో  ప్ర‌జ‌ల్లో రేంటింగ్ త‌గ్గుతోంద‌ని సంకేతాలు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌రిద్ద‌రు మంత్రుల‌ను త‌ప్పించి త‌మ ప్ర‌భుత్వం అద్భుతంగా ప‌నిచేస్తోంద‌నే సంకేతాలు పంపారు చంద్ర‌బాబు. చుట్టూ ఉన్నవాళ్లు అదే చెప్పారు. అది నిజమే కావచ్చేమో. కానీ ప్రజలు దేన్ని నమ్ముతున్నారు? అన్నది ముఖ్యం.  టీడీపీ అనుకున్నది వేరు ప్రజలు నమ్మింది వేరు. దీంతో బాబు చేసిన విన్యాసం మొద‌టికే మోసం తెచ్చింది.  

ఇక‌, ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వాధినేత‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. సీఎంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర విభేదాలు క‌నిపిస్తున్నాయి. రైతు బంధు ప‌థ‌కాన్ని త‌న పార్టీ వారికే అమ‌లు చేస్తున్నార‌ని, ధ‌ర‌ణి వ‌ల్ల ఎవ‌రికి ల‌బ్ధి చూకూరిందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన‌డం.. వంటివి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చారు.

ఇక‌, క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌లకు అందిరావాల్సిన స‌ర్కారు.. మౌనంగా ఉండ‌డం, కేవ‌లం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ‌మే అన్నీ చేయాల‌నే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌డం.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక సంకేతాల‌ను నింపింది. దీని ప్ర‌భావం దుబ్బాక ఉప పోరుపై ఖ‌చ్చితంగా ప‌డింద‌న‌డంలో సందేహం లేదు.

అయితే.. ఈ పాపం మొత్తాన్ని మంత్రుల‌పై నెట్టి.. తాను సుద్ద‌పూస‌ను అనే త‌ర‌హాలో కేసీఆర్ ఇప్పుడు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు తెర‌దీస్తుండ‌డంపై విస్మ‌యం వ్య‌క్తమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప‌నిచేయ‌ని మంత్రులను మార్చాల్సిందే. అయితే.. ఆచి తూచి మంత్రుల‌ను ఎంపిక చేసుకున్న కేసీఆర్‌.. ఏడాదిన్న‌ర తిరిగే స‌రికే వారిపై ప‌నిచేయ‌డం లేద‌నే ముద్ర వేసుకున్నారంటే.. త‌ప్పు వారివ‌ద్ద ఉందా.?  వారిని ఎంపిక చేసిన ఆయ‌న వ‌ద్ద ఉందా? అనేది కూడా ప‌రిశీలనార్హ‌మే. ఏతా వాతా.. ఇప్పుడు కేసీఆర్ మాత్రం మంత్రుల‌ను మార్చేస్తాన‌ని చూచాయ‌గా.. సంకేతాలు ఇచ్చేశారు.

న‌లుగురు వ‌ర‌కు మంత్రుల‌ను ప‌క్క‌న పెడ‌తార‌ని ఇప్ప‌టికే చ‌ర్చ న‌డుస్తోంది. కానీ, మంత్రుల‌ను మార్చినంత మాత్రాన ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఏర్ప‌డిన వ్య‌తిరేక భావ‌న పోగొట్ట‌డం సాధ్యం కాద‌ని.. అంతా నేనే.. నేను చెప్పిన‌ట్టే జ‌ర‌గాల‌నే భావ‌న‌..  రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలే ఉండ‌రాద‌నే ఆలోచ‌న నుంచి ముందు కేసీఆర్ బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆదిశ‌గా ఆలోచిస్తారో.. లేదా.. త‌నే సుప్రీం అంటారో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.