నాడు రేవంత్‌.. నేడు ర‌ఘునంద‌న్‌.. కేసీఆర్ సాధించేదేంటి?

తెలంగాణ‌లోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న ద‌రిమిలా.. అక్క‌డ చోటు చేసుకుంటు న్న ప‌రిణామాలు ఏం చెబుతున్నాయి? అస‌లు ఇంత‌గా వివాదానికి కార‌ణం ఏంటి?  బీజేపీ రాష్ట్ర చీఫ్ అరెస్టు, పోలీసుల లాఠీ చార్జీలు, న‌గ‌దు దొరికింద‌ని కేసులు.. ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిందా?  లేక గెలుపుపై ఆశ‌లు వ‌దులుకుందా? ఇలాంటి ధ‌ర్మ సందేహాలు అనేకం తెర‌మీదికి వ‌చ్చాయి.

ఇక‌, దుబ్బాక ఘ‌ట‌న‌కు గ‌తంలో 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సృష్టించిన భీతావ‌హ దృశ్యానికి కూడా పోలిక‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

నాడు.. రేవంత్‌రెడ్డి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే. కొడంగల్‌లో ఆయ‌న‌ను అడ్డుకునేందుకు అధికార టీఆర్ ఎస్ వేయ‌ని ఎత్తులేదు. పారించ‌ని వ్యూహం లేదు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్టు చేశారు. ఈ ప‌రిణామం.. తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. రేవంత్ మ‌ళ్లీ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే.. త‌మ‌కు ఇబ్బందులేన‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు భావించే ఇలా చేశాయ‌ని అప్ప‌ట్లో రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇంతా చేస్తే.. అక్క‌డ టీఆర్ ఎస్ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక‌, ఇప్పుడు దుబ్బాక వంతు వ‌చ్చింది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఉప ఎన్నిక వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో బీజేపీ త‌ర‌ఫున మ‌ళ్లీ ర‌ఘునంద‌న్‌రావు పోటీకి దిగారు. వాస్త‌వానికి ఇక్క‌డ ఓటు బ్యాంకును ప‌రిశీలిస్తే.. టీఆర్ ఎస్‌ది ఏక‌ప‌క్ష విజ‌యం. ఈ విష‌యంలో సందేహం లేదు. అయినా కూడా ర‌ఘునంద‌న్ కేంద్రంగా రాజ‌కీయాలు ఊపందుకున్నాయి.

ఆయ‌న బంధువుల ఇళ్ల‌లో పోలీసులు హ‌ఠాత్తుగా త‌నిఖీలు దిగ‌డం, న‌గదు దొరికింద‌ని హ‌ల్చ‌ల్ చేయ‌డం. కేసులు న‌మోదు చేయ‌డం.. అడ్డుకున్న బీజేపీ నేత‌ల‌పై లాఠీ చార్జీలు చేయ‌డం వంటివి చూస్తే.. దుబ్బాక విష‌యంలోనూ గ‌తంలొ కొడంగల్ విష‌యంలో అనుస‌రించిన వ్యూహాన్నే టీఆర్ ఎస్ అనుస‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌త 2018 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ర‌ఘునంద‌న్ రావు సాధించిన ఓట్లు కేవ‌లం 22 వేల పైచిలుకు.

కానీ, టీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కిన రామ‌లింగారెడ్డి 89 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇంత‌లోనే బీజేపీ భారీ ఎత్తున ఓట్లను స‌మైక్య ప‌రుచుకుందా?  అంటే అది కూడా లేదు. అదే నిజ‌మైతే.. టీఆర్ ఎస్ వైఫ‌ల్యాల‌ను స‌రిచేసుకునే గొప్ప అవ‌కాశం కేసీఆర్ ఆయ‌న పార్టీకి ద‌క్కింద‌నే అనుకోవాలి. కానీ, ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం ద్వారా టీఆర్ ఎస్ త‌న ప‌రువును తానే పోగొట్టుకున్న‌ట్టుగా భావించాల్సి వ‌స్తోంద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఎత్తులు మంచివే అయినా.. ఒక అల‌జ‌డి.. ఒక ఉత్పాతం సృష్టించ‌డం ద్వారా సాధించాల‌నుకునే విజ‌యం అంత‌గా సంతృప్తి ఇచ్చే ప‌రిణామం కానేకాదు. ఇది ఒక యాగీగా మిగిలిపోవ‌డంతోపాటు.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై మ‌ర‌క‌లు ప‌డేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు.

పోనీ.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ‌బ్బులు ఏమైనా కోట్ల‌లో ఉన్నాయా? అంటే అది కూడా లేదు. కేవ‌లం 18 ల‌క్ష‌ల రూపాయ‌లు. ర‌ఘునంద‌న్‌రావు.. నిజంగానే టీఆర్ ఎస్‌ను డ‌బ్బుతో ఓడించాల‌ని అనుకుంటే.. ఈ మొత్తం ఏమూల‌కు స‌రిపోతుంది? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. బ‌లం లేని పార్టీ అంటూనే కేసీఆర్ వేసిన అడుగులు.. పార్టీకి మ‌ర‌క‌ల‌నే మిగిల్చింది. ఏదేమైనా ఇలాంటి ప‌రిణామాలు అధికార పార్టీలో ఆత్మ‌రక్ష‌ణ‌ను ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.