ఎన్నికల్లో విజయం సాధించాక.. జో బైడెన్ స్పీచ్ ఇదే

NRI


విభజనవాదంతో అంతకంతకూ ద్వేషాన్ని పెంచే తీరును డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తే.. అందుకు భిన్నంగా తన వారిని.. తన తోటివారిని కలుపుకు వెళ్లటమే కాదు.. అమెరికా మొత్తం ఒక్కటే అన్నట్లుగా వ్యవహరించాలన్న జో బిడెన్ ఇస్తున్న పిలుపు.. అమెరికాలో కొత్త రాజకీయం షురూ అయ్యిందా? అన్నభావన కలిగేలా చేస్తుందని చెప్పాలి.

పోలింగ్ మొదలైన తర్వాత.. ఫలితాలు వెల్లడవుతున్న వేళలోనూ మాట్లాడేందుకు ఇష్టపడని బైడెన్.. గెలుపునకు అత్యంత సమీపాన వచ్చిన వేళలోమాత్రం నోరు విప్పారు. బైడెన్ కు భిన్నంగా ట్రంప్ మాత్రం.. అదే పనిగా మాట్లాడుతూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అంతేకాదు.. ఓటమిని ఒప్పుకోకుండా న్యాయపోరాటం చేస్తానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు సంచలనంగానే కాదు.. సొంత పార్టీ నేతలు (రిపబ్లికన్లు) సైతం  తప్పు పడుతున్నారు.

ఫలితాలు వెలువడి.. గెలుపు లెక్కలు తేలిన వేళ.. కాబోయే దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బైడెన్ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా భవిష్యత్తు కోసం  ప్రజలు ఓట్లు వేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ.. దేశ ప్రతిష్టను పెంచటమే తన కర్తవ్యమన్నారు. అదే సమయంలో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్ ను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. తన సొంత రాష్ట్రమైన డెలావెర్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.

ఎన్నికల్లో ఓడిన ట్రంప్ తనకు శత్రువేమీ కాదన్న ఆయన.. అమెరికా డెవలప్ మెంట్ కోసం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంటూ స్నేహ హస్తాన్ని చాచటం గమనార్హం. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఇందుకోసం సోమవారం ప్రత్యేక కార్యాచరణ.. కార్యదళాన్ని  ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటానని.. అన్ని వర్గాల ప్రయోజనాల్ని కాపాడతానని చెప్పారు.

అంతా కలిస్తే.. అమెరికన్లు ఏదైనా సాధించగలరన్న ఆయన.. రిపబ్లికన్లు.. డెమొక్రాట్ల మధ్య తేడా చూపనని హామీ ఇచ్చారు. దేశాన్ని రెండు పార్టీల చీల్చనని.. తన మదిలో యునైటెడ్ స్టేట్స్ అన్నది మాత్రమే ఉంటుందన్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.