జ‌గ‌న్ లేఖ పెడుతున్న కుంప‌టి-ముప్పేట వ్య‌తిరేక‌త.. బెయిల్ ర‌ద్దేనా?

సాధార‌ణంగా ఎలాంటి కేసులు లేని ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి వంటివారు న్యాయ‌వ్య‌వ‌స్థ విష‌యంలో ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. రాజ్యంగ బ‌ద్ధ‌మైన న్యాయ‌వ్య‌వస్థ‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఇస్తారు. ఆదేశాల‌ను పాటిస్తారు. ఒక‌వేళ స‌ద‌రు ఆదేశాలు.. న్యాయాధికారుల వ‌ర్తన వంటివి త‌మ‌కు ఇబ్బందిగా ఉంటే.. ఉన్న‌త‌న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అంతే త‌ప్ప నేరుగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో ఢీ కొట్టిన సంద‌ర్భాలు.. న్యాయాధికారుల‌కు, న్యాయ‌మూర్తుల‌కు త‌ప్పుడు ఉద్దేశాలు ఆపాదించిన ప‌రిస్థితులు మ‌న‌కు క‌నిపించ‌వు.

మ‌రి... దాదాపు 36 కేసుల్లో నిందితుడిగా ఉన్న‌.. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్న  ముఖ్య మంత్రి జ‌గ‌న్ న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలి?  న్యాయాధికారుల విష‌యంలో ఎలా ఉండాలి?  వారికి ఇవ్వాల్సిన గౌర‌వం, మ‌ర్యాద వారికి ఇవ్వాల్సిందేక‌దా.. కానీ, అలా లేద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌పైనే ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఆయ‌న ఆస్తులు కూడ‌గ‌ట్టారంటూ.. వివ‌రాలు బ‌హిర్గ‌తం చేయ‌డం, వివాదాలు చేయ‌డం, రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై కూడా దుర్భాష‌లాడ‌డం వంటివి స‌ర్వ‌త్రా విస్మ‌యానికి గురి చేస్తున్నాయి.

నిజానికి బెయిల్ నిబంధ‌న‌ల మేర‌కు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను, న్యాయాధికారుల‌ను ప్ర‌భావితం చేయ‌రాదు. కానీ, ఆయ‌న ఇప్పుడు ఆయ‌న చేసింది ఏంటి? ఏకంగా న్యాయ‌వ్య‌వ‌స్థ విశ్వ‌స‌నీయ‌త‌పైనే బుర‌ద జ‌ల్లారు. ఆ వ్య‌వ‌స్థపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ప్ర‌భావం క‌లిగేలా లేఖ సంధించారు. అక్క‌డితో ఆగ‌కుండా.. స‌ద‌రు లేఖ‌ను బ‌హిరంగ ప‌రిచి.. మ‌రింత దుమారానికి కేంద్రంగా మారారు. ఇదంతా కూడా ఉద్దేశ పూర్వ‌కంగా న్యాయాధికారుల‌ను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయడం కింద‌కే వ‌స్తుంద‌ని ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌, అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్స్ స‌హా పలు రాష్ట్రాల బార్ అసోసియేషన్లు పేర్కొంటున్నాయి.

అంతేకాదు, బెయిల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ.. జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు కోరుతూ.. సుప్రీం కోర్టుకు లేఖ‌లు పంపారు. దీంతో జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. జాతీయ స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై సీబీఐ కోర్టులో కేసుల విచార‌ణ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ నేరుగా ఇలా.. లేఖ రాయ‌డం.. సాక్ష్యాల‌ను సైతం ప్ర‌భావితం చేస్తుంద‌నేది వీరి వాద‌న‌. ఇలా ఎటు చూసినా.. జ‌గ‌న్ చిక్కుకుపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను గౌర‌వించి.. త‌ప్పులు స‌రిచేసుకునే బ‌దులు.. రాజ్యాంగ వ్య‌తిరేక శ‌క్తిగా ఆయ‌న మారుతుండ‌డంపై సుప్రీం కోర్టు సీరియ‌స్ అయితే.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితి అయినా ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.