జగన్ ను తాకిన జనాగ్రహం-మ‌డ‌మ తిప్పుతున్నారా.. పొలిటిక‌ల్ గుస‌గుస‌!

మాట‌త‌ప్పను-మ‌డ‌మ తిప్ప‌ను!- అనే నినాదం గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌ల నోటి నుంచి వెల్లువ‌లా దూసుకువ‌చ్చిన విష‌యం ప్ర‌జ‌ల మ‌దిలో ఇంకా ప‌దిలంగానే గుర్తుంది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌ను ప్రొజెక్టు చేసేందుకు ఈ నినాదాన్ని బాగానే వాడుకున్నారు. అధికారంలోకి వ‌చ్చాక.. చెప్పిందే చేస్తారు.. చేసేదే ఇప్పుడు చెబుతున్నారు! అంటూ.. అప్ప‌ట్లోనే వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఇక‌, జ‌గ‌న్ కూడా ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు వినిపించారు. దీంతో రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని.. నిఖార్స‌యిన నాయ‌కుడు వ‌చ్చార‌ని అంద‌రూ అనుకున్నారు.

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వైసీపీ పాల‌నకు ఏడాదిన్న‌ర పూర్త‌య్యింది. అనేక కార్య‌క్ర‌మాలు, వివిధ సంక్షేమ ప‌థ‌కాలు.. తీసుకువ‌చ్చారు. తాము తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల‌తో అంబ‌రాన్నంటే.. సంబ‌రాల్లో ప్ర‌జ‌లు మునిగిపోయారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ఇటీవ‌ల కాలంలో రెండు కీల‌క విష‌యాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌మ‌నిస్తే.. ఆదిలో ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ నాయ‌కులు చెప్పిన మ‌డ‌మ తిప్పను అనే మాట రివ‌ర్స్ టెండ‌రింగ్‌ మాదిరిగా రివ‌ర్స్ అవుతోందా? అనే సందేహాలు వ‌చ్చేలా చేస్తున్నాయి.

రెండు ముఖ్య‌మైన నిర్ణ‌యాల్లో.. ఒక‌టి మ‌ద్యం, రెండు ఇసుక‌. ఈ రెండు విధానాల విష‌యంలో తాము తీసుకువ‌చ్చిన మార్పులు.. రాష్ట్రంలో భారీ ప్ర‌క్షాళ‌న‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని వైసీపీ ప్ర‌భుత్వం గ‌ర్వంగా ప్ర‌క‌టించుకుంది. మ‌ద్యం విష‌యంలో అయితే.. వ‌చ్చే మూడేళ్ల‌లో పూర్తిగా ఎత్తేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించిం ది. ఈ క్ర‌మంలోనే మ‌ద్యం ధ‌ర‌ల‌ను షాక్ కొట్టేరీతిలో పెంచుతామంటూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అధికారంలోకి రాగానే ధ‌ర‌ల‌ను అదేవిధంగా పెంచారు. దీనికితోడు మ‌ద్యం దుకాణాల‌ను 25 శాతం తొలి ఏడాదిలోనే త‌గ్గించారు. దీంతో రాష్ట్రంలో మ‌ద్య నిషేధం దిశ‌గా ప్ర‌బుత్వం అడుగులు వేస్తోంద‌ని అనుకున్నారు.

ఇక‌, జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పేది లేదు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో చుక్క మ‌ద్యం చూద్దామ‌న్నా క‌నిపిం చ‌ద‌ని అనుకున్నారు. కానీ, ఏడాదిన్న‌ర‌ తిరిగే స‌రికి.. పెంచిన మ‌ద్యం ధ‌ర‌ల‌ను రెండు సార్లు త‌గ్గించారు. అదేస‌మ‌యంలో ఏటా 25 శాతం చొప్పున మ‌ద్యం దుకాణాల‌ను(వైన్స్‌) త‌గ్గిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టినా.. తొలి ఏడాది 25శాతం త‌గ్గించినా.. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 13 శాతం మేర‌కు మాత్రమే.. త‌గ్గించారు. అది కూడా జ‌న‌స‌మ్మ‌ర్థం లేని ప్రాంతాల‌ను ఎంచుకుని ఎత్తేశారు. ఇక‌, ఇప్పుడు వ‌రుస‌గా రెండోసారి మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ఇదే విష‌యాన్ని స‌ర్కారు చెప్పేసింది కూడా!

మ‌న ద‌గ్గ‌ర మ‌ద్యం ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నందున పొరుగు రాష్ట్రాల నుంచి అక్ర‌మ ర‌వాణా పెరిగింద‌ని. మ‌రి ఇప్పుడే ఇలా మ‌డ‌మ త‌ప్పేస్తుంటే.. రేపు మ‌ద్య నిషేధం అయ్యేనా? అప్పుడు మాత్రం పొరుగు రాష్ట్రాల్లో అమ్మ‌కాలు జ‌ర‌గ‌వా? ఏపీలో మ‌ద్య నిషేధం ఉంద‌ని పొరుగు రాష్ట్రాలు ఏపేయ‌వుక‌దా? అప్పుడు ఏం చేస్తారు? మ‌ద్య నిషేధం అన్న మాట‌కు మంగ‌ళం ఇస్తారు!! ఇక‌, ఇసుక విష‌యంలోనూ ఇప్ప‌టికే ఒక‌ పాల‌సీలు మార్చారు. ఇప్పుడు కూడా ఇసుక‌పై అవ‌గాహ‌న లోపంతోనే స‌ర్కారు విధానాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. పైగా ఇంతా చేసి.. ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల‌ని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు ఆదాయం ఇచ్చే మార్గాల‌పై జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంద‌ని పొలిటిక‌ల్ కారిడార్స్‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.