మోడీకి జగన్ లేఖ !

గాన గంధర్వుడు, తెలుగుజాతితోపాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణంతో యావత్ సినీలోకం విషాదంలో మునిగిన సంగతి తెలిసిందే. కరోనాతో పోరాడిన బాలు తిరిగి వస్తారని, తన పాటలతో అభిమానులను అలరిస్తారని అంతా భావించారు. కానీ, 50 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు.

ఇప్పటికే లెక్కలేనన్ని అవార్డులు, బిరుదుల పొందిన బాలుకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాశారు.
గాన దిగ్గజం బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న వంటి అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని మోడీని జగన్ కోరారు. తమ రాష్ట్రంలోని నెల్లూరులో బాలు జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, గత 50 ఏళ్లుగా ప్రపంచ సంగీత పరిశ్రమపై ఆయన చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం అని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఆయన ఘనతలు సంగీతాన్ని మించినవని, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడిన అరుదైన ఘనత దక్కించుకున్న దిగ్గజ గాయకుడు బాలు అని జగన్ అన్నారు.

ఉత్తమ నేపథ్య గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక పురస్కారాలు, 6 సార్లు దక్షిణభారత ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు, 2016లో 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' గా 'సిల్వర్ పీకాక్ మెడల్' బహూకరణ..ఇలా ఎన్నో అవార్డులు రివార్డులు బాలు సొంతమని జగన్ లేఖలో పేర్కొన్నారు.

బాలు సంగీత సేవలకు ప్రతిగా భారత కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించిందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించిందని జగన్ తెలిపారు. సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు ఘనమైన నివాళి అర్పించాలని జగన్ కోరారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.