ఒకనాడు ..కుప్పనూర్పిళ్ళంటే ఎంత సందడి...!
ఒకనాడు ..కుప్పనూర్పిళ్ళంటే ఎంత సందడి...!
తుపానులు తప్పించుకుని..చీడపీడల బారిన పడకుండా ..కోత ..కట్టేత సవ్యంగా జరిగి తే..!
సంబరంగా..సంతోషంగా..!
ధాన్యం మాసూలు మొదలెట్టేవారు..!
మొదట్లో బల్ల కొట్టుడు..తదనంతరం ట్రాక్టర్లు..!
ఇప్పుడు వరికోత యంత్రాలు అనుకోండి..!
మూడు రోజులు..ఒక్కోసారి నాలుగు రోజులు పొలంలోనే మకాం..!
మెట్ట తూటి కర్రలు ఒంచి..పైన ఎండుగడ్డి వేసి..గూడు వేసేవారు.
నలిగిన గడ్డి ..పైన దళసరి దుప్పటి..పట్టు పానుపు కన్నా సుఖము..సౌకర్యవంతంగా ఉండేది.
పచ్చని చేలు ప్రసవానంతరం విశ్రాంతి తీసుకునేవి.
రకరకాల పక్షులు..పరిగ గింజలు తృప్తిగా తింటుండేవి.
పంట చేలు తడి ఆరి ..గట్లు గట్టి పడేవి.
డిశంబరు చలి ..షోలాపూర్ దుప్పటి ముసుగు..మెలకువగా ఉంటే చలిమంట ..!
మంటలో కాల్చిన తేగలు ..తేగ తొక్క కాలిన వాసన..!
మంట సెగకు చుర్రుమనే ఒళ్ళు..!
తెల్లవారు ఝామునే కుప్ప చుట్టూ గిరగిరా తిరుగుతున్న ట్రాక్టరు రొద!
కళ్ళం చుట్టూ గడ్డి మేట్లు..!
రాత్రిళ్ళు పీతలు కోసం బొక్కలు వెతికే నక్కలు..వాటి ఊళలు..!
పొద్దున్నే పాలేరు తెచ్చే ..మెత్తని ఇడ్లీ..కారం చెట్నీ..కమ్మని కాఫీ..!
అక్కడక్కడా ..తడి ఆరని చెక్కల్లో..వాలిన కొంగలు..!
ధాన్యం పోగేసి..ఎగరబోత కు ఎదురు చూపులు..!
అప్పుడప్పుడు పలకరించే పైరగాలే..తాలు గింజల్ని వేరు చేసే ..ప్రకృతి యంత్రం!
జీతగాళ్ళకు కళ్ళం లోనే చెల్లింపులు.
ఆనవాయితీ ..గా వచ్చే కొందరు రైతులు కొలిచిన ధాన్యం సంతోషంగా సేకరించుకోవడం.
సాయంత్రం అయ్యేసరికి తినుబండారాల కావిళ్ళు..!
వేరుశనక్కాయలు..తేగలు..జంతికలు..బెల్లం మిఠాయి..ఇంకా ఎన్నో..!
ధాన్యం కొలవటం..పనివాళ్ళకు..పప్పలు పంచటం..!
పంట మాసూలు అయింతర్వాత..బస్తాల కెత్తటం..లెక్కకు మిక్కిలి వస్తే సంతోషం..!
పరిగ ఏరుకునే వాడు..కళ్ళం ఊడ్చుకునే వాడు..
అందరూ సంబరపడేవారు..!
బస్తాలు బళ్ళకేయటం...గాదుల్లో పోసే వరకు ఇదొక జాతర!
అక్కడ నుండి..అమ్మకం ఒక యాతన!
వచ్చేది సంక్రాంతి..!
కొత్త ఒడ్లు ..అటుకుల దంపుడు..!
కొత్త బట్టలు కావాలి..!
పిండి వంటలు వండుకోవాలి..!
చేతినిండా సొమ్ము కావాలి..!
షావుకారు ..కి అరువు కావాలి..!
అరకొర చెల్లింపులు..!
చాలీ చాలని నగదు..!
అయినా సర్దుకు పోయిన కాలం..!
తర్వాత్తర్వాత అనేక మార్పులు..!
ఆ సంతోషం లేదు..సంబరం లేదు..!
గిట్డు బాటు లేదు..!
రైతుకు ..కూలీలకు స్పష్టమైన విభజన..!
వ్యాపారికి ..రైతుకు వైరం..!అనుమానం!
ఆ రోజులు ..అప్పటి అనుభూతి..అనుభవించటం ..!
ఆ కాలంలో జీవించటం ఒక యోగం!
ఆ మధుర స్మృతులు ..జ్ఞాపకాల్లో సజీవం!
ఈ తరానికి తెలియని..కనలేని మధురస్వప్నం!