గ్రేటర్ ఎన్నికలతో ఆ మంత్రుల జాతకం మారుతుందా?


జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశాలుండడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులను  గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించారట. ఈ క్రమంలోనే బల్దియా బరిలో గెలుపు టీఆర్ఎస్ మంత్రులకు పరీక్షగా మారిందట. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్...గ్రేటర్ లో మంత్రులకు అప్పగించిన బాధ్యతలను బట్టి వారిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని టాక్ వస్తోంది.

దీంతో, ఈ సారి బల్దియా వార్ లో టీఆర్‌ఎస్‌ గెలుపు కొందరు మంత్రులకు డూ ఆర్ డై అని ప్రచారం జరుగుతోంది. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు అవలీలగా ఎక్కిన కొందరు మంత్రులకు గ్రేటర్ వార్ లో తమకు అప్పగించిన డివిజన్ల అభ్యర్థులను గెలిపించడం ఓ చాలెంజ్ గా మారిందట. డివిజన్ స్థాయిలో అభ్యర్థుల గెలుపు కోసం వారికంటే ఎక్కువగా కొందరు మంత్రులు కష్టపడుతున్నారట.

చిలుకనగర్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌,  అంబర్‌పేటలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సరూర్‌ నగర్‌లో జగదీష్‌రెడ్డి.. ఇలా...సామాజిక సమీకరణాలను బట్టి డివిజన్లు అప్పగించారు కేసీఆర్. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో రాత్రింబవళ్లు ప్రచారంలో తలమునకలయ్యారు ఈ నేతలు. ప్రచారంలో మంత్రులు ఎప్పుడు వస్తారా అన్న పరిస్థితి నుంచి....అభ్యర్థులు ఎపుడొస్తారు అని మంత్రులు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందట.

ఆయా డివిజన్ల గెలుపుపై మంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉందని టాక్ వస్తోంది. తమ తమ డివిజన్లలో ఓటమి తమకు శరాఘాతంగా మారవచ్చని మంత్రులు కూడా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారట. గ్రేటర్‌ ఎన్నికల్లో పర్ఫార్మన్స్ ను బట్టి టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రమోషన్...మంత్రులకు డిమోషన్ ఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో, ఈ సారి జీహెచ్ ఎంసీ ఎన్నికలు అభ్యర్థులతోపాటు మంత్రులకు జరుగుతోందన్న టాక్ వస్తోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.