గ్రేట‌ర్ ఎఫెక్ట్: కేసీఆర్‌కు రెండు విధాల ప‌రీక్షేనా?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. మైకులు మూగ‌బోయాయి. క‌రోనా తీవ్రంగా ఉంద‌ని తెలిసినా.. త‌గ్గ‌లేద‌ని సంకేతాలు వ‌స్తున్నా.. ఏ పార్టీ కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎవ‌రికి వారు పైచేయి సాధించేందుకు ఉన్న అన్ని ఆయుధాల‌ను వినియోగించుకున్నారు. రోడ్ షోలు చేశారు. బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. ఇంటింటి ప్ర‌చారం చేశారు. మొత్తం‌గా టెక్నిక‌ల్‌గా చూస్తే.. స్థానికంగా జ‌రుగుతున్న ఎన్నిక‌లే అయిన‌ప్ప‌టికీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను మించిపోయాయ‌నేది వాస్త‌వం. ఇక‌, ఇప్పుడు పార్టీల భ‌విత‌వ్యాన్ని తేల్చాల్సింది.. ప్ర‌జ‌లు. మొత్తం గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చార ఎపిసోడ్‌లో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

గ‌డ‌ప‌దాటేది లేదు.. ఇవి కూడా ఓ ఎన్నిక‌లా?  మా విజ‌యానికి తిరుగుందా? ఉంటుందా?  అని చెప్పుకొచ్చిన టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కూడా ప్ర‌చారం చేయ‌క త‌ప్ప‌లేదు. ఇక‌, ఇప్పుడు గ్రేట‌ర్ ఫైట్‌పై మేధావి వ‌ర్గాలు ఏమంటున్నాయి?  ఎవ‌రు ఎలా విశ్లేషిస్తున్నారు? అనే విష‌యాలు కీల‌కంగా మారాయి. ఈ విష‌యంలో బీజేపీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కేసీఆర్ అంశం చాలా ఆస‌క్తిగా మారింది.

అస‌లు ప్ర‌చారానికే రాను అన్న కేసీఆర్.. వ‌చ్చేయ‌డం, బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. త‌న‌ను ఎద‌గ‌నీయ‌కుండా .. బీజేపీ అడ్డుప‌డుతోంద‌ని చెప్ప‌డం.. యూపీ సీఎం, మ‌హారాష్ట్ర మాజీ సీఎం.. వంటివారిపైనా.. విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివి.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఇంత చేయ‌డానికి కార‌ణాలేంటి?  కేసీఆర్ ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి నిముషంలో బ‌య‌ట‌కు రావాల్సిన అగ‌త్యం ఏముంది? అంటే.. రెండు కీల‌క కార‌ణాలు చెబుతున్నారు మేధావులు. ఒక‌టి.. గ్రేట‌ర్ లో బీజేపీ ఏం సాధిస్తుంది? ఏం చేస్తుంది? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. హోరా హోరీ ప్ర‌చారంతో.. బీజేపీ ఇమేజ్ పెరిగిపోయింది. ప్ర‌జ‌ల్లో బీజేపీ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ పార్టీ ఒక‌టి ఉంది! అనే చ‌ర్చ వ‌చ్చింది. ఇది కేసీఆర్‌కు సుత‌రాము మింగుడు ప‌డ‌ని విష‌యం. తాను త‌ప్ప‌.

తెలంగాణ‌లో.. మ‌రో ప్ర‌త్యామ్నాయం ఉండ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేదు. అందుకే ఏ పార్టీ అయినా.. ఏదైనా.. ఆయ‌న ముందు.. స‌న్నాసి పార్టీనే.. స‌న్నాసి నాయ‌కులే! అయితే.. ఇప్పుడు ఈ ఆలోచ‌న‌ల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. బీజేపీ అగ్ర‌నేత‌లు ప్ర‌చారంలో దూసుకుపోవ‌డంతో కేసీఆర్ దిగిరాక త‌ప్ప‌లేద‌నేది ఒక విశ్లేష‌ణ‌.

ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే.. త‌న కుమారుడు, మంత్రి, భావి సీఎం కేటీఆర్ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. గ్రేట‌ర్ ఫైట్‌లో గ‌తంలో ఆయ‌న చ‌క్రం తిప్పి.. విజ‌యం సాధించారు. అయితే.. ఇటీవ‌ల దుబ్బాక ప‌రాభావం త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక‌లు కావ‌డం.. త‌న కుమారుడిని త్వ‌ర‌లోనే కీల‌క స్థానంలో నిల‌బెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డ ప‌రాజ‌యం వ‌స్తుందోన‌నే ఒక విధ‌మైన ఆందోళ‌న‌తో కేసీఆర్ హుటాహుటిన రంగంలోకి దిగార‌ని అంటున్నారు.

ఎలా చూసుకున్నా.. పార్టీ ఇమేజ్‌ను కాపాడుకోవ‌డంతోపాటు బీజేపీకి దీటుగా జ‌వాబు చెప్ప‌డం, కేటీఆర్ ఇమేజ్‌ను కాపాడ‌డం అనే రెండు అంశాల ప్రాతిప‌దిక‌గా.. కేసీఆర్ వ్యూహాత్మ‌క ప్ర‌చారం చేశార‌ని అంటున్నారు మేధావులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.