ఏపీ కాంగ్రెస్ లో ఒక హఠాత్పరిణామం

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో రోడ్డు పక్కన చిన్న కొట్టు పెట్టుకున్న అతను ఊరి వదిలిపోయేవారందరి లెక్క రాసుకుంటూ ఉంటాడు. ఆ ఊరినుంచి పోయే వారే గానీ ఆ ఊరికి వచ్చేవారు ఎవరూ ఉండరని వెటకారం చేస్తుంటాడు. సడెన్ గా ఆ ఊరికి ఒక వ్యక్తి వచ్చినపుడు ఆశ్చర్యపోతాడు. ఇపుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది.

ఏపీ కాంగ్రెస్ ను వీడిపోయే వారే గాని వచ్చే వారు ఎవరూ లేరు. కొత్త చేరికకు ఆ పార్టీలో అవకాశమే లేదు. ఎపుడూ కాంగ్రెస్ కి రాజీనామా వార్తలే కనిపిస్తున్న సమయంలో ఆ పార్టీలోకి ఒక ఫైర్ బ్రాండ్ సీనియర్ నేత వచ్చారు. ఆయన ఎవరో కాదు. ఆ పార్టీ మాజీ సభ్యుడే. మాజీ ఎంపీ హర్షకుమార్ మళ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన ఏం భవిష్యత్తు ఆశించి చేరారో గాని... ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమన్ చాందీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని శపథం చేశారు. విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదన్నారు. అయినా బీజేపీని నిలదీయడంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. అందుకే వారు   కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.

హర్షకుమార్ మాట ఏమోగాని... ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నాయకుడు ఉంటే కాంగ్రెస్ నిలబడేదే. కాంగ్రెస్ లో జననేత ఎవరూ లేకపోవడం... మరో బలమైన వేదిక కాంగ్రెస్ వాదులకు దొరకడంతో ఆ పార్టీ అక్కడ ఉనికి కోల్పోయింది. అసలు కారణం విభజన అని అందరికీ తెలిసిందే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.