వైసీపీని సొంత నేతలే కొంపముంచేస్తున్నారా ?

ఇపుడిదే అంశంపై జిల్లా పార్టీ నేతల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మంత్రి గుమ్మనూరు జయరామ్ వ్యవహారం పదే పదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రిని టార్గెట్ చేసుకుని టీడీపీ విశాఖ జిల్లా నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ముందేమో బెంజికారు తీసుకున్నట్లు ఆరోపించిన అయ్యన్న తాజాగా 203 ఎకరాల భూమిని కుటుంబసభ్యులు, బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆరోపణలు మొదలుపెట్టారు.

ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ నుండి మంత్రి కొడుకు ఈశ్వర్ బెంజికారును బహుమతిగా తీసుకున్నట్లు ఆరోపించారు. తన ఆరోపణలకు ఏవో కొన్ని ఫొటోలను కూడా చూపించారు. ఇపుడేమో మంత్రి భూభాగోతం అంటే ఆరోపణలు మొదలుపెట్టారు.  సరే మంత్రి అవినీతికి పాల్పడ్డారా ? లేదా అన్నది ఒక విషయం. ఇదే సమయంలో చింతకాయల చూపిస్తున్న ఆధారాలు సరైనవేనా ? కాదా ? అన్నది మరో విషయం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  మంత్రికి సంబంధించిన వ్యవహారాలపై టీడీపీ నేతలకు ఎవరు ఉప్పందిస్తున్నారు ? అన్నదే ప్రధానం. పైగా రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని మంత్రిపై ఎక్కడో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా నేత చింతకాయలు ఆరోపణలు చేయటం ఏమిటి ? మంత్రిపై ఏమైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే కర్నూలు జిల్లాలోని టీడీపీ నేతలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. జిల్లాలోని టీడీపీ నేతలు మంత్రిపై ఆరోపణలు చేయటం కూడా సహజమే.   ఎందుకంటే అంతా ఒకే జిల్లా వాళ్ళు కాబట్టే ఒకళ్ళ విషయం మరొకళ్ళకు తెలియటంలో ఆశ్చర్యం కూడా లేదు.

ఈ నేపధ్యంలోనే పార్టీ నేతలపైనే మంత్రి మద్దతుదారులకు అనుమానాలు మొదలయ్యాయట. మంత్రంటే పడని చాలామంది నేతలే జయరామ్ కు సంబంధించిన విషయాలను ప్రత్యర్ధులకు అందిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయట. జిల్లాలోని నేతలకు ఇచ్చి ఆరోపణలు చేయిస్తే వెంటనే పార్టీ నేతలపైనే అనుమానాలు పెరిగిపోతాయి కాబట్టి వైజాగ్ నేత ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ లీకులను ఎలా అరికట్టాలో తెలీక కిందా మీదా అవుతున్నారు మంత్రి మద్దతుదారులు.

మంత్రయిన తర్వాత జయరామ్ కు చాలామంది సొంతపార్టీ నేతలతో విభేదాలు మొదలయ్యాయట. ఎందుకంటే తన వర్గాన్ని తప్ప ఇతర నేతలను ఎవరినీ మంత్రి దగ్గరకు తీసుకోవటం లేదట. దాంతో సహజంగానే చాలామందికి జయరామ్ వ్యవహార శైలిపై వ్యతిరేకత పెరిగిపోయింది.  సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చేట్లు మంత్రి ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నదే పెద్ద ప్రశ్న. ఎదుటి వాళ్ళని అనుమానించే బదులు ముందు తనలోని లోపాలను సవరించుకుంటే సమస్యే ఉండదు కదా ?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.