కర్ణాటకలో మండలిలో అసాధారణ పరిణామాలు

కర్ణాటక శాసనమండలిలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారపక్షం తీరు నచ్చకుంటే ఆందోళన చేయటం.. నినాదాలు చేయటం లాంటివి మామూలే. అందుకు భిన్నంగా అధికార.. విపక్షాల మధ్య ఘర్షణ శ్రుతి మించటమే కాదు.. కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ సభ్యుడైన ఛైర్మన్ పై అధికార బీజేపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చ సందర్భంగా సభ్యులు తమ స్థాయిని మర్చిపోయి ప్రవర్తించారు.  

అధికార.. విపక్ష నేతల మధ్య ఘర్షణ మామూలే అయినా.. అందుకు భిన్నంగా సభ్యులంతా బాధ్యత మరిచి హద్దులన్ని దాటేశారు. ఒకరినొకరు తోసుకోవటం.. ప్రత్యర్థి సభ్యులపై ముష్ఠిఘాతాలు కురిపించుకోవటం.. డిప్యూటీ ఛైర్మన్ నను ఆయన సీటు నుంచి కిందకు లాగేయటం లాంటివి జరిగాయి. గవర్నర్ ఆదేశాలతో మంగళవారం సభ ప్రారంభమైంది. దీనికి ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే మరింత క్లారిటీ వస్తుంది. కర్ణాటక కౌన్సిల్ ఛైర్మన్ కే. ప్రతాపచంద్ర శెట్టిపై బీజేపీ.. జేడీఎస్ సభ్యులు కొద్ది రోజుల క్రితం అవిశ్వాస నోటీసు ఇచ్చారు. దీనిపై చర్చ జరపకుండా ఈ నెల 10న సభను వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం సభను ఏర్పాటు చేశారు. అయితే.. ఛైర్మన్ ను సభలోకి రాకుముందే ప్రవేశ ద్వారాన్నిఅధికార బీజేపీ నేతలు మూసేశారు. ఛైర్మన్ రాక ముందే హడావుడిగా సభాధ్యక్ష కుర్చీలో డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ కూర్చున్నారు. కోరం లేకుండానే సమావేశాన్ని ప్రారంభించినట్లుగా ప్రకటించారు. దీంతో.. విపక్ష కాంగ్రెస్ నేతలు తీవ్ర  ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆవేశంతో ఊగిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎం.నారాయణస్వామి.. నసీర్ అహ్మద్ తదితరులు డిప్యూటీ ఛైర్మన్ ను కుర్చీలో నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.

ఛైర్మన్ ప్రవేశ ద్వారం తలుపుల్ని నసీర్ అహ్మద్ బలవంతంగా తెరిచారు. దీంతో.. ఛైర్మన్ లోపలకు వచ్చి.. సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. తనపై అధికారపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో చేసిన ఆరోపణలు సహేతుకంగా లేవంటూ రూలింగ్ ఇచ్చారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీనిపై యడ్డీ ప్రభుత్వం.. మరోసారి గవర్నర్ ను ఆశ్రయిస్తామని పేర్కొంది. ఈ రచ్చ అంతా ఎందుకంటే.. శాసనమండలిలో అధికార బీజేపీకి బలం లేదు. కాంగ్రెస్ కు మాత్రమే ఉంది. దీంతో.. ఇంత హడావుడి చోటు చేసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్.. జేడీఎస్ ప్రభుత్వం కొలువు తీరటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ అధికారంలోకి రావటం తెలిసిందే. దీంతో తమకు పట్టులేని మండలిలో పట్టు పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం.. ఇంత రచ్చగా మారి.. మండలికి ఉండే గౌరవ మర్యాదల్ని మంటగలిసేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.


Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.