చిరంజీవి సీఎం అయ్యుండే వాడట...నిజమేనా ?

తాజాగా తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి గురించి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉండుంటే ముఖ్యమంత్రి అయ్యేవారట. ఉండుంటే అదయ్యే వారు..ఇదయ్యే వారు అనేందుకు ఆధారాలు ఏమీ లేవు. ఏదో ఓ అంచనా వేసుకుని మాట్లాడుతుంటారందరు. అందరిలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన సోదరుని కోసం ఏదో మాట్లాడారు. నిజానికి చిరంజీవి రాజకీయాల్లో ఉండుంటే అనటంలో అర్ధమే లేదు. ఎందుకంటే చిరంజీవిని రాజకీయాల్లో ఉండొద్దని ఎవరన్నారు ?

సినీనటునిగా తనకున్న ఇమేజితో చాలా తేలిగ్గా ముఖ్యమంత్రయిపోవచ్చని చిరంజీవి అనుకున్నారు. అయితే పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నికలు అయ్యేలోగానే మెగాస్టార్ కు బాగా ఇమేజి వచ్చేసింది. కేవలం కాపుల కోసమే పార్టీ పెట్టారనే ప్రచారం విపరీతంగా జరిగిపోయింది. దానికితోడు కాపులు కూడా చిరంజీవిని చూసుకుని చాలా రెచ్చిపోయారు. అప్పట్లో ప్రజారాజ్యంపార్టీ కాలర్ టూన్ ఉందంటే వాళ్ళు కచ్చితంగా కాపులే అయ్యుంటారనే ముద్ర పడిపోయింది పార్టీ మీద.

ఎప్పుడైతే ప్రజారాజ్యంపార్టీ కాపుల పార్టీ అనే ముద్ర పడిపోయిందో వెంటనే మిగిలిన సామాజికవర్గాలు చిరంజీవికి దూరమైపోయాయి. ఇది చాలదన్నట్లు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికలో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు జరిగిన ప్రచారంతో  బాగా డ్యామేజి జరిగిపోయింది. మొదటి నుండి నియోజకవర్గ బాధ్యతలను మోసిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు మార్చేయటం, డబ్బులున్న వాళ్ళకే టికెట్లనే ప్రచారంతో చిరంజీవికి నష్టం జరిగింది.

ఇదే సమయంలో టికెట్ల కేటాయింపులో చిరంజీవి, బావ అల్లు అరవింద్, నాగబాబు లు రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పంచుకున్నారనే ఆరోపణలకు కొదవే లేదు. పార్టీ కార్యాలయానికి వెళితే పట్టించుకునే దిక్కేలేదనే గొడవలు పెరిగిపోయాయి. అన్నింటికన్నా మించిన సమస్య ఏమిటంటే ప్రజారాజ్యంపార్టీ ఆఫీసులో కీలక బాధ్యతల్లో ఉన్నవారు కానీ చిరంజీవి పక్కనే ఉన్న వారికి కానీ జనాలతో ఎటువంటి సంబంధం లేకపోవటమే. డాక్టర్ మిత్ర, పరకాల ప్రభాకర్, డాక్టర్ వివేక్ లాంటి వాళ్ళు అప్పట్లో పార్టీలో చక్రంతిప్పారు. నిజానకి వీళ్ళెవరికీ ప్రజాబలం లేదు.

ఇన్ని లోపాల కారణంగానే చిరంజీవిని జనాలు నమ్మలేదు. కాబట్టే ఎన్నికల్లో పార్టీ చతికలపడింది. మరి అప్పట్లో యువరాజ్యం అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ కూడా తన వంతుగా పార్టీలో కానీ ప్రచారంలో కానీ ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తే. ఇలాంటి అనేక లోపాల వల్ల పార్టీ దెబ్బతినేసింది. పార్టీ పెట్టగానే సీఎం అయిపోదామనుకున్న మెగాస్టార్ కు ఓపిక లేదని అర్ధమైపోయింది. అందుకనే ఫలితాలు వచ్చిన కొంత కాలానికి హోలుసేలుగా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్రమంత్రయిపోయారు. రాజ్యసభ పదవీ కాలం అయిపోయిన తర్వాత అసలు అడ్రస్సే లేకుండాపోయారు. మరి ఇంతోటి దానికి చిరంజీవి రాజకీయాల్లోనే ఉండుంటే అనే మాటకే అర్ధంలేదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.