రైతు ఉద్యమంపై చంద్రబాబు కామెంట్స్ - ఏమన్నారో తెలుసా?


2020 ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలు, జాతీయ ఉద్యమాలపై మౌనం పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నా... వాటిపై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే వాటిలో ఆంధ్ర తెలంగాణకు లింక్ అయి ఉన్న అంశాలు చాలా తక్కువ. ఇక మోదీ బీజేపీ విషయంలోను అనుకూలంగా గానీ ప్రతికూలంగా గానీ మాట్లాడటం లేదు.

అయితే, ఇపుడు దేశంలో ప్రతిరాష్ట్రానికి, ప్రతి రైతుకు జరుగుతున్న అన్యాయంపై దేశ వ్యాప్త రైతు ఉద్యమం మొదలైంది. అది ఢిల్లీని తాకడమే కాదు, ఢిల్లీకి సెగలు పుట్టిస్తోంది. దానిని పరిష్కరించకపోతే ప్రపంచ దేశాల్లో మోదీ చులకన అయ్యే ప్రమాదం ముంచుకు వస్తోంది.

కొన్ని రోజులుగా ఇది అతిపెద్ద చర్చనీయాంశం. ప్రతి పౌరుడి మద్దతు రైతుల వైపే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దిగిరాక తప్పలేదు. రైతులతో చర్చలకు కూడా సిద్ధమైంది. కానీ ఇప్పటివరకు అయితే అవేవీ ఫలించలేదు. దీంతో 8వ తేదీ భారత్ బంద్ కు రైతుల మద్దతు పలికారు. గత 6.5 సంవత్సరాల మోడీ పాలనలో తొలిసారి అతిపెద్ద నిరసన సెగ మోడీకి తగిలినట్టయ్యింది.

ఇంతటి కీలక సంఘటనపై చంద్రబాబు స్పందించారు. మరి ఆయన ఎవరి వైపు నిలబడ్డారు. ఏమన్నారు. అంటే... ఆయన రైతు వైపు నిలబడ్డారు. అయితే, రైతు వైపు నిలబడినంత మాత్రాన మోడీని తిట్టాల్సిన అవసరం లేదన్న రాజకీయ న్యాయాన్ని పాటించారు.  ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించడం ఇదే మొదటిసారి.  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని, ఆ చర్చలు రైతులకు మేలు జరగడం అన్న విషయం వద్ద సానుకూల ముగింపు కలిగి ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. పాలకుల నిర్ణయాలు రైతు ప్రయోజనాలే మిన్నగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరిపి  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు మోదీ సర్కారుకు సూచించారు.

రైతాంగానికి మేలు చేసే విధానాలకే మొగ్గు చూపాలని, బిల్లులను హడావిడిగా పెట్టొద్దని అన్నారు. కొత్త చట్టాల వల్ల అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతులపై మరింత భారం మోపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనీస మద్దతు ధర రైతుకు చట్టబద్ధమైన హక్కుగా ఉంటేనే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో ఏ కారణం చేతనో జగన్ రెడ్డి నోరు విప్పలేదు. కానీ చంద్రబాబు మొదటిసారి ఓపెన్ అయ్యారు. ఈ బిల్లులపై వైసీపీ మొదటి నుంచి కేంద్రం తెచ్చిన బిల్లును గుడ్డిగా ఓకే చెప్పింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.