ఛ‌లో తిరుప‌తి-క‌దం తొక్క‌నున్న రైతాంగం

ప‌దండి ముందుకు ప‌దండి తోసుకు.. ప‌దండి పోదాం పైపైకి అన్న  "మ‌హాక‌వి శ్రీశ్రీ "వాక్కులే ఆద‌ర్శంగా.. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు త‌ప్ప‌! అన్న "కార‌ల్ మార్క్స్ "సిద్ధాంత‌మే ప‌ర‌మావ‌ధిగా రాజ‌ధాని రైతులు మ‌రింత ఉత్సాహంతో ముందుకు సాగాల‌ని... రాబోయే రోజుల్లో ఏపీలో జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని.. త‌మ వాణిని.. రాజ‌ధాని బాణిని పార్ల‌మెంటులో వినిపించేలా.. ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసేలా ముందుకు క‌ద‌లాల‌ని రాజ‌ధాని త్యాగ ధ‌నులైన అమ‌రావ‌తి రైతుల‌కు సూచిస్తున్నారు మేధావులు.
ప్ర‌పంచ స్థాయి న‌గరంగా భాసిల్లాల్సిన రాజ‌ధాని అమ‌రావ‌తపై రాజ‌కీయ క్రీనీడ‌లు అలుముకున్న నేప థ్యంలో రాజ‌ధాని సాధ‌నే ఆశ‌యంగా మూడువంద‌ల ముప్ప‌యి రోజులుగా ఇక్క‌డి రైతాంగం ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసింది. 33 వేల ఎక‌రాల భూముల‌ను త్యాగం చేసిన 29 గ్రామాల రైతాంగం.. రాజ‌ధాని ని త‌ర‌లించ‌వ‌ద్ద‌ని, దీనిని అభివృద్ధి చేస్తే.. ప్రపంచ స్థాయి న‌గ‌రంగా గుర్తింపు రావ‌డ‌మే కాకుండా.. రాష్ట్ర ముఖ‌చిత్రం ప్ర‌పంచ స్థాయిలో ద్విగుణీకృతం అవుతుంద‌ని.. ప‌సిమొగ్గ‌గా ఉన్న రాజ‌ధానిని చిదిమేయ వ‌ద్ద‌ని వేడుకుంటున్నారు. అయితే.. అధికారంలో వైసీపీ వీరి ఆవేద‌న‌ను, ఆలోచ‌న‌ను కూడా పెడ‌చెవిన పెడుతోంది.
పైగా పోలీసు ఉక్కుపాదాల‌తో ఉద్య‌మాన్ని అణిచి వేసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. రైత‌ల‌పై కేసులు పెట్ట‌డం.. అకార‌ణంగా జైలు పాలు చేయ‌డం, బెదిరింపులు, సాధింపులు వంటివాటికి పాల్ప‌డ‌డం ద్వారా ఉద్య‌మాన్ని అణిచేయాల‌ని చూస్తోంది. మ‌రోవైపు మంత్రులు, అధికార పార్టీ నాయ‌కులు రైతుల‌ను కించ‌ప‌రుస్తున్నారు. ఇక‌, ఇత‌ర ప‌క్షాలైన టీడీపీ, జ‌న‌సేన, క‌మ్యూనిస్టులు రాజ‌ధాని ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నా.. రైతుల‌కు అండ‌గా ఉంటున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ట్టి హామీని సాధించలేక పోయారు. ఇక‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా గోడ మీద పిల్లి వాటంలా తాంబూలాలిచ్చేశాం.. అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది.
ఈ ప‌రిణామాలు రాజ‌ధాని రైతాంగాన్ని మ‌రింత‌గా వేధిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మ స‌మ‌స్య‌ను వేద‌న‌ను.. రాజ‌ధాని అవ‌స‌రాన్ని జాతీయ‌స్థాయిలో వినిపించారు. క‌నిపించిన వారిన‌ల్లా వారు వేడుకున్నారు. న్యాయ‌పోరాటం సైతం చేస్తున్నారు. అయితే.. రాజ‌ధాని విష‌యంలో అస్ప‌ష్ట‌త కొన‌సాగుతూనే ఉంది. మ‌రి ఇప్పుడు ఏంచేయాలి?  ఎలా ముందుకు సాగాలి?  రాజ‌ధాని రైతుల ముందున్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న ఇదే!! దీనికి స‌మాధానంగా.. వారికి అందివ‌చ్చిన అవ‌కాశం.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌! ఔను నిజ‌మే! చ‌ట్ట స‌భ‌లో రైతులు త‌మ వాణిని, బాణిని వినిపించేందుకు ఇదో అద్భుత‌మైన అవ‌కాశం.
తిరుపతి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌కు మ‌రో రెండు నెల్ల‌లోనే నోటిఫికేష‌న్ రానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచే రైతులు ఈ ఉప పోరుపై దృష్టి పెట్టాల‌ని సూచిస్తున్నారు మేధావులు. చ‌ర్చ‌ల ద్వారా సాధించ‌లేనిది.. చ‌ట్ట స‌భ‌ల ద్వారా సాధించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని నూరిపోస్తున్నారు. తిరుప‌తి వెంక‌న్న పాదాల సాక్షిగా.. ప్ర‌మాణాలు చేసిన పార్టీలకు త‌గిన బుద్ధి చెప్పేందుకు.. అన్న‌దాత అమేయ శ‌క్తి అని నిరూపించుకునేందుకు తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ఆయుధంగా వాడుకోవాల‌ని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. నిజ‌మైన ఒక్క రైతునైనా పార్ల‌మెంటుకు పంపించి.. రాజ‌ధాని విష‌యాన్ని బ‌లంగా వినిపించి.. ఫ‌లితం రాబ‌ట్టుకోవాల‌ని సూచిస్తున్నారు.
ఈ క్ర‌మంలోనే చ‌లో తిరుప‌తి నినాదంతో ఉద్య‌మాన్ని ప్రారంభించి రాజ‌ధాని నుంచి తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించి.. అక్క‌డి ఉప పోరులో పోటీ చేయాల‌నేది మేధావుల ప్ర‌ధాన దిశానిర్దేశం. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా క‌లిసి రావాల‌నిసూచిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మ గౌర‌వాన్నినిలుపుకొనేందుకు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అన్న‌దాత‌కు ప‌ట్టం క‌ట్ట‌డం ద్వారా రాజ‌ధానికోసం పోరు స‌ల్పేలా రైతును గెలిపించాల‌ని పిలుపునిస్తున్నారు. గ‌తంలో మ‌హారాష్ట్ర రైతులు తమ హ‌క్కులు సాధించుకునేందుకు, త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునేందుకు చేసిన భారీ పాద‌యాత్ర‌ను మేధావులు గుర్తు చేస్తున్నారు.
అప్ప‌ట్లో బుల్లెట్ ట్రైన్ కోసం.. వివిధ ప్రాజెక్టుల కోసం మ‌హా ప్ర‌భుత్వం రైతుల నుంచి బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ చేప‌ట్టింది. ఈక్ర‌మంలో వారికి స‌రైన ప‌రిహారం కూడా అంద‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన రైతులు భారీ పాద‌యాత్ర నిర్వ‌హించారు. నాసిక్ నుంచి ముంబై వ‌ర‌కు సుమారు 180 కిలో మీట‌ర్ల దూరాన్ని దాదాపు 30 వేల మంది రైతులు పాద‌యాత్ర‌గా న‌డిచి త‌మ స‌త్తాను చాటారు. ప్ర‌భుత్వానికి రైతుల ఆగ్ర‌హం ఆక్రోశం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అదే త‌ర‌హాలో ఇప్పుడు రాజ‌ధాని అమ‌రావతి నుంచి ఉప ఎన్నిక జ‌రిగే తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు రైతులు మ‌హా పాద‌యాత్ర కు సిద్ధం కావాలన్ని మేధావుల మేలిమి సూచ‌న‌. రాజ‌కీయ పార్టీల వ్యూహాలు, ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ‌ల‌ను నిర‌సిస్తూ.. రాజ‌ధాని సాధ‌నే ధ్యేయంగా ముందుకు క‌ద‌లాల‌ని పిలుపు నిస్తున్నారు. రైతు ఉద్య‌మం ధాటికి ప్ర‌భుత్వాలు.. పార్టీలు సైతం దిగిరాక త‌ప్ప‌ద‌ని చాటి చెబుతున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.