ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం కొత్త రూల్ !!


2024 ఎన్నికలే లక్ష్యంగా దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటోన్న బీజేపీ ఏపీలో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి మైలేజ్ తెస్తోన్న హిందుత్వ ఎజెండాను ఏపీలోనూ కొంతకాలంగా బీజేపీ అప్లై చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

అంతర్వేది ఘటనను హైలైట్ చేసిన ఏపీ బీజేపీ నేతలు...ఇకపై కూడా సందర్భానుసారంగా ప్రభుత్వంపై ఆ తరహా విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉన్నారు. అయితే, ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ బీజేపీ కేడర్ లో కొంత ఊపు వచ్చిందన్న టాక్ ఉన్నప్పటికీ.. అంతర్వేది సహా కొన్ని ఘటనల విషయంలో సోము ఒకలా మాట్లాడితే కొందరు నేతలు ఇంకోలా మాట్లాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు వ్యక్తపరచడంతో జాతీయ స్థాయిలో బీజేపీ నేతలంతా ఒకే స్టాండ్ పై ఉన్న తరహాలో ఏఫీ నేతలు ఉండడం లేదన్న టాక్ వచ్చింది. ఏపీ బీజేపీ నేతల్లో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఏపీలో బీజేపీ తరఫున ఏది మాట్లాడినా సోము వీర్రాజే మాట్లాడతారని, అది కూడా అధిష్టానం నిర్దేశించిన పరిధి ప్రకారమే మాట్లాడాలని బీజేపీ హుకుం జారీ చేసింది.

అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, పార్టీకి సంబంధించిన అంశాలే ప్రస్తావించాలని బీజేపీ అధిష్టానం షరతు విధించింది. గతంలో రాం మాధవ్ వంటి కొందరు సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యల ప్రభావం పార్టీ పై పడుతోందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అందుకే, ఇకపై బీజేపీ జాతీయ కార్యవర్గంలోని సభ్యులైనా, అధికార ప్రతినిధులైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా పార్టీకి సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని బీజేపీ అధిష్టానం తేల్చేసిందట.

2024 ఎన్నికలే లక్ష్యంగా రాబోయే మూడేళ్లపాటు ఏపీలో బీజేపీ పటిష్టతపైనే నేతలంతా దృష్టి పెట్టాన్నది బీజేపీ పెద్దల షరతుల సారాంశం. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జనసేన అండతో వైసీపీ, టీడీపీలకు గట్టి పోటీనిచ్చి త్రిముఖ పోటీగా నిలబడే స్థాయికి ఎదగాలని బీజేపీ భావిస్తోంది  


ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజీ జరిగిందని, అందుకే కన్నా స్థానంలో సోమును నియమించారని టాక్ ఉంది. మాజీ అయిన తర్వాత కూడా కన్నా కామెంట్లు అలాగే ఉన్నాయని, అందుకే కన్నాతోపాటు మిగతా నేతల వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఈ షరతును బీజేపీ అధిష్టానం తెరపైకి  తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, జగన్ కు కన్నా అనుకూలమని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.అయితే, ఏపీలో పార్టీ పటిష్టత కోసం ఇన్నాళ్లు తాము కష్టపడ్డామని, ఆ కష్టానికి తగ్గ్గట్టు పదవులు ఇచ్చి పెదవులు కుట్టేస్తే ఏం లాభం అని ఏపీ బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట.

ఏపీలో గల్లీ రాజకీయాలపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు పూర్తిగా అవగాహన ఉండదని, ఏపీలో బీజేపీ నేతలపై కట్టడి పరిమితులు దాటుతోందని అనుకుంటున్నారట. ఈ విధంగా చేయడం పార్టీ మనుగడకే ప్రమాదమని, ఇటువంటి చర్యల వల్ల పార్టీ పటిష్టం కాకపోగా బలహీనపడే అవకాశముందని వాపోతున్నారట. మరి, ఈ కొత్త షరతు ఏపీ బీజేపీకి లాభమా ...నష్టమా?  ఇకపై సోము సోలో పెర్ ఫార్మన్స్...పార్టీకి మైలేజా? డ్యామేజా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.