తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే:బండి సంజయ్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన బల్దియా పోరులో 49 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లలో గెలుపొందిన బీజేపీ....2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 49 సీట్లు సాధించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పింది. బల్దియాపోరులో ఘన విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్ లు బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. తాజా ఫలితాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కారు...సారు...ఇక రారని సంజయ్ అన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్న విషయం తాజా ఫలితాలతో మరోసారి రుజువైందని కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తాజా  ఫలితాలే నాంది అని సంజయ్ అన్నారు.

టీఆర్ఎస్, కేసీఆర్ స్వార్థపూరిత, అహంభావ రాజకీయాలకు గ్రేటర్ ఎన్నికలు రిఫరెండం అని బండి సంజయ్ అన్నారు. దుబ్బాకలో ముఖ్యమంత్రి అల్లుడి ఇజ్జత్ మీద దెబ్బకొట్టారని, హైదరాబాద్ లలో ముఖ్యమంత్రి కొడుకు ఇజ్జత్ మీద ప్రజలు దెబ్బకొట్టారని సంజయ్ విమర్శించారు. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదని, కానీ అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదని సంజయ్ హితవు పలికారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో 100కు పైగా స్థానాల్లో గెలుపొందుతామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ 56 స్థానాలకే పరిమితమైంది. అనూహ్యంగా పుంజుకొని టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన బీజేపీ 49 స్థానాల్లో గెలుపొందింది. ఇక, ఎంఐఎం 43 డివిజన్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.