అలివికాని చోట.. బీజేపీ విన్యాసాలు.. ఫలించేనా?
వాపును చూసి బలుపు అనుకునేవారికి ఏం చెబుతాం!!- తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ గురించి ఇటీవల కాలం లో వెల్లువెత్తిన కామెంట్లలో ఈ కామెంట్ జోరుగా వైరల్ అయింది. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తర్వాత.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పుంజుకోవడంతో బీజేపీ దూకుడు మామూ లుగా లేదని.. ఇక, ప్రజలు తమకు పట్టం కట్టేసినట్టేనని కమల నాథులు ఊహాలోకాల్లో విహరిస్తు న్న మా ట వాస్తవం. ఈ క్రమంలో వారి నోటి నుంచి మాటల తూటాలు శతఘ్నుల మాదిరిగా దూసుకు వస్తున్నా యి. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ చేశాం.. ఏపీలో రెండు చేస్తాం! అంటూ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యల వెనుక ఈ దూకుడే కనిపించింది.
అయితే.. నిజంగానే జీవీఎల్ చెప్పినట్టు బీజేపీకి అంత సత్తా ఉందా? ఏపీ ప్రజలు బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్ కు ఫిదా అయిపోతారా? అనేది కీలక ప్రశ్న. ఇప్పటివరకు ఉన్న పరిణామాలను గమనిస్తే.. నేతలు తప్ప కార్యకర్తలు లేని పార్టీ ఏదైనా ఉంటే.. అది బీజేపీనే! అందుకే.. గతంలో రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. కేడర్ పెంపుపై దృష్టి పెట్టారు. కనీసం 50 లక్షల సభ్యత్వం సాధిస్తామని ఆయన ప్రకటించారు. కానీ, ఈ లక్ష్యం చేరకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడున్న నాయకులైనా ఆదిశగా అడుగులు వేస్తున్నారా? అంటే.. అది ఎక్కడా కనిపించడం లేదు. మీడియా మైకులు కనిపించగానే పూనకంవచ్చినట్టు వ్యాఖ్యలు సంధిస్తున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మాత్రం అర్ధం చేసుకుంటున్నట్టు కనిపించడం లేదు.
ఏపీలో ప్రజలు బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో విసిగిపోయారు. మరీ ముఖ్యంగా రాజధాని ఏర్పాటుకు ప్రధాని నీళ్లు, మట్టి ఇచ్చారు తప్ప.. తమకు ఏం ఇచ్చారనే వాదన ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. ఈ సెంటిమెంటు పోతే.. తప్ప.. బీజేపీవైపు ప్రజలు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇక, పార్లమెంటులో నాటి ప్రధాని చేసిన హోదా ప్రకటనను నేటి ప్రధాని మోడీ పట్టించుకోకపోవడాన్ని కూడా ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకో పోతున్నారనేది వాస్తవం. మరోవైపు గ్రూపు రాజకీయాలు.. సామాజిక వర్గాల వారీగా నేతలు విడిపోవడం.. ఇన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న బీజేపీ.. ముందు వాటిని సరిచేసుకునేందుకు అంతర్గత సర్జికల్ స్ట్రయిక్స్ చేసుకుంటే మంచిదనే సూచనలు వస్తుండడం గమనార్హం.
మరి జీవీఎల్, సోము వీర్రాజులు ఆదిశగా అడుగులు వేస్తే.. మున్ముందైనా.. పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. బహుశ.. అటు జగన్ కానీ... ఇటు చంద్రబాబు కానీ.. బీజేపీ విషయంలో మౌనంగా ఉండడం వెనుక.. ఆ పార్టీలోని లోపాలే కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అంటే.. ఎలాగూ ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు.. ప్రజలు అక్కున చేర్చుకునేది అసలే లేదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే.. బీజేపీని ఖాతరు చేయడం లేదనే వాదన కూడా ఉంది.