బీజేపీకి డ్రాబ్యాక్‌.. విష్ణు వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ మంట‌లు

రాష్ట్రంలో ఎదగాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలి.. అని క‌ల‌లు కంటున్న బీజేపీకి పెద్ద డ్రాబ్యాక్ వ‌చ్చింది. ఎంత రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ..  ఎవ‌రినైనా టార్గెట్ చేయొచ్చేమో కానీ.. మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయ‌డం అనేది ఎప్పుడూ వివాద‌మే పార్టీల‌తో సంబంధం లేకుండా.. నాయ‌కులు ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

సింప‌తీకి, సెంటిమెంటుకుకూడా మ‌హిళ‌లు కేంద్రంగా ఉన్నారు క‌నుక‌.. ఓటు బ్యాంకు రాజ‌కీయం అంతా వారి చూట్టూతానే తిరుగుతుంది కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా మ‌హిళల విష‌యంలో పార్టీలు చాలా జాగ్ర‌త్త‌గా ముందుకు వెళ్తుంటాయి. మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. విజ‌యం సాధించి... రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీకి మ‌హిళా ఓటు బ్యాంకు అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యం వారు గ్ర‌హించారో లేదో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన పార్టీ మ‌హిళ‌ల‌నే కేంద్రంగా చేసుకున్న ప‌రిస్థితులు చెబుతున్న పాఠం ఇదే.

అంతెందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు నారీ శ‌క్తి పేరుతో వారికి ఏదో ఒక రూపంలో కొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉంది. దీనిని బ‌ట్టి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు సైతం మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం అర్ధ‌మ‌వుతూనే ఉంది.

కానీ, ఎటొచ్చీ.. ఆ పార్టీనేత‌గా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , అనంత‌పురానికి చెందిన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మాత్రం నోరు జారారు. తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి కోసం ఉద్య‌మిస్తున్న నేత‌లు, రైతులు, మ‌హిళ‌లు పార్టీల‌కు అతీతంగా మ‌హాపాద యాత్ర‌కు రెడీ అయ్యారు. వీరిలో కాంగ్రెస్ నాయ‌కురాలు.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ కూడా ఉన్నారు. ఇదిలావుంటే, టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన‌ విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి సుంక‌ర ప‌ద్మ‌శ్రీ విష‌యంలో నోరు జారారు. ఆమె పేరు చెప్ప‌కుండానే..  ఓ మ‌హిళ అంటూ.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు.

ఒక‌రు 50 వేల రూపాయ‌ల చీర క‌ట్టుకుని రైతుల‌తో క‌లిసి పోరాటాలు చేస్తారు! అని కామెంట్ విసిరారు. ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. టీడీపీపై విరుచుకుప‌డుతున్న క్ర‌మంలోనూ అనూహ్యంగా విష్ణువ‌ర్ధ‌న్ నోటి నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉంద‌నేది వాస్త‌వం.

క‌రువు ప్రాంతాల్లో పంపు సెట్లు కొట్టేసినోళ్లే.. కుర్తాలు, రంగు రంగుల ఫైజ‌మాలు వేసుకుని ఆపై.. కోట్లు వేసుకుని తిరుగుతున్న‌ప్పుడు.. త‌ర‌త‌రాలుగా మూడు పంట‌లు పండించిన వారు ఆ మాత్రం ఆ మాత్రం క‌ట్టుకోరా అంటూ విమ‌ర్శ‌లు శ‌రాల్లా దూసుకువ‌చ్చాయి.

అంతేకాదు, ఎన్నిక‌ల్లో కేవ‌లం 1345 ఓట్లు సాధించిన విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డా మ‌హిళ‌ల‌పై కామెంట్లు  చేసేది ..? అని నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము అమరావతి గురించి మాట్లాడుతున్నాం, మీరు ఆడవాళ్ళ చీరల గురించి మాట్లాడుతున్నారు.

మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం, మీ చదువు ఇంటర్. మీ పైన రెండు కేసులు ఉన్నాయి. అవి కూడా ఆడవాళ్లకు సంబంధించి మీరు చేసిన పనులకు పెట్టిన కేసులే. మరి మిమ్మల్ని ఏమని పిలవాలి సార్ ? అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ ప్ర‌భావం.. పార్టీపైనా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి మున్ముందు ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా.. మ‌హిళ‌ల‌తో పెట్టుకున్న రాజ‌కీయనేత‌లు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన‌ట్టు చ‌రిత్ర ఎక్క‌డా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.