అవి బీసీ కార్పొరేషన్లా? వైసీపీ కార్పొరేషన్లా?

కుండ‌లు డింకీలు కొడుతున్నా.. మీసాల‌కు సంపెంగ నూనె పెట్టుకోవాల‌న్న‌ట్టుగా ఉంద‌ట‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ని! ఒక ప‌క్క‌.. కీల‌క ప్రాజెక్టుల‌కు.. నిధులు లేవు.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలకు నిధుల కొర‌త వెంటాడుతోంది. మ‌రీముఖ్యంగా అవ్వలు తాత‌ల‌కు ఇస్తాన‌న్న‌.. పెంచుతామ‌న్న రూ.250 (రెండో ఏడాది) పింఛ‌న్ పెంపున‌కు నిధులు లేవు. ఇక‌, నెలంతా ప‌నిచేసిన ఉద్యోగుల‌కు నెల‌కోసారి ఇచ్చే వేత‌నాల అంశంలోనూ అనేక త‌డ‌బాట్లే! ప్ర‌తి ప‌దిహేను రోజులకు ఒక‌సారి.. ఎవ‌రు అప్పిస్తారా? అంటూ.. భూత‌ద్దం ప‌ట్టుకుని మ‌రీ.. వెతుకుతున్న ప‌రిస్థితి. నిధులు లేవ‌నే పేరుతో మూడు రాజ‌ధానుల‌కు ముహూర్తం పెట్టుకున్న స్థితి. అమ‌రావ‌తిని అట‌కెక్కించిన దుస్థితి!!

మ‌రి ఇంత‌గా స‌ర్కారు ఆర్థిక కుస్తీలు ప‌డుతూ.. అల‌సి సొల‌సిపోతోందిక‌దా.. మ‌రి ఎక్క‌డైనా పొదుపు మంత్రం పాటిస్తోందా? అంటే.. అప్పుడెప్పుడో.. ఏడాదిన్న కింద‌ట సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో చెప్పిన మాట‌లు ఈ సంద‌ర్భంగా గుర్తుకు వ‌స్తున్నాయి. మ‌నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబ‌ట్టి.. త‌ప్ప‌కుండా ఆర్థిక నియంత్ర‌ణ పాటించాల్సిందే.. అందుకే జ‌గ‌న‌న్న అతి త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు! అని వైసీపీ నేత‌లు హ‌డువుడి చేశారు. క‌ట్ చేస్తే.. ఆ త‌ర్వాత ఆర్థిక నియంత్ర‌ణ అనే మాట‌నే వారు మ‌రిచిపోయారు. ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌లేకపోయినా.. అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్లు పెంచ‌లేక పోయినా.. అస్మ‌దీయుల‌కు మాత్రం అందిన కాడికి దోచిపెట్ట‌డానికి త‌గిన‌న్న మార్గాల‌ను మాత్రం ప్ర‌భుత్వం వెతుక్కుంటోంద‌నే వ్యాఖ్య‌లు ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల పేరిట‌.. ప‌దుల సంఖ్య‌లో మేధావుల‌ను నియ‌మించుకుని.. సొంత కొలువులో ప‌నిచేసేవారికి ల‌క్ష‌ల్లో వేత‌నాలు ఇస్తున్న ప్ర‌భుత్వం.. పందేరాల‌కు త‌క్కువేమీ చేయ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా.. లెక్క‌చేయ‌డంలేదు. తాజాగా ఇప్పుడు .. మ‌రో జీవోను విడుద‌ల చేసింది. ఇటీవ‌ల ఏర్పాటైన‌.. బీసీ కార్పొరేస‌న్‌ల‌లో నియ‌మితులైన చైర్మ‌న్ల‌కు జీతాల‌ను ఖ‌రారు చేస్తూ.. ఇచ్చిన ఈ జీవో.. చూస్తే.. స‌గ‌టు పౌరుడికి క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. ఒక్కొక్క చైర్మ‌న్‌కు నెల‌కు 65 వేల రూపాయ‌ల వేత‌నం, దీనికి తోడు భ‌త్యాలు, వాహ‌నాల‌ను కూడా స‌ర్కారే స‌మ‌కూరుస్తోంది. ఈ ఖ‌ర్చు అద‌నం. నిజానికి బీసీలకు మేళ్లు చేయాల‌నే ల‌క్ష్యంతో పెట్టిన కార్పొరేస‌న్‌ల లో త‌మ వారిని నియ‌మించుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి స‌మాధానం లేదు.

ఇక‌, ఇప్పుడు ప్ర‌జాధ‌నాన్ని 56 కార్పొరేస‌న్ల‌కు నియ‌మితులైన చైర్మ‌న్ల‌కు పంచేందుకు జ‌గ‌నన్న స‌ర్కారు మేళ్ల‌కు తెర‌దీసింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బీసీల‌కు మేలు చేయాలంటే.. చైర్మ‌న్ల‌కు మేలు చేయ‌డం అనే సూత్రాన్ని అవ‌లంభిస్తున్న‌ట్టుగా ఉంద‌ని.. ఒక‌వైపు స్టేట్లో అన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిలిచిపోయాయి. గ‌త స‌ర్కారులో ఏర్ప‌డిన రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసే ప‌రిస్థితి కూడా లేద‌ని స‌ర్కారు పెద్ద‌లే చెబుతున్నారు. కానీ, ఇప్పుడు కార్పొరేస‌న్ల పేరుతో.. ప్ర‌జాధ‌నాన్ని ల‌క్ష‌ల్లో నెల‌వారీ పంప‌కాల‌కు తెర‌దీయ‌డం మాత్రం వారికే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.