అధ్యక్షుడిగా అచ్చెన్న ఎంపిక వెనుక

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు 23 శాసనసభా స్థానాలకే పరిమితం కావడంతో అసెంబ్లీలోనూ, బయట కూడా వైసీపీని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతోంది. అయితే.. అచ్చెన్నాయుడు మాత్రం టీడీపీకి ప్రధాన స్వరంగా మారి అసెంబ్లీతో పాటూ బయటా గట్టిగా ఎదురునిలుస్తున్నారు.

అలాంటి సమయంలో ఈఎస్ఐ కుంభకోణంలో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపడం.. ఆ తరువాత ఆయనకు కోవిడ్ సోకి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయన స్వరం బలంగా వినిపించడం లేదు. కానీ, అదే సమయంలో ఒక బీసీ నేతను వైసీపీ లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టిందని.. శస్త్రచికిత్స చేయించుకుని ఇంకా కోలుకుంటున్న దశలో ఉన్న వ్యక్తిని బలవంతంగా వందల కిలోమీటర్లు ప్రయాణం చేయించి తీసుకెళ్లడంతో మళ్లీ శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని.. ఆసుపత్రిలో, జైలులో ఎక్స్‌పోజ్ కావడం వల్లే అచ్చెన్నకు కోవిడ్ సోకిందని.. దీనంతటికీ వైసీపీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు బలంగా ఆరోపించడంతో అచ్చెన్నపై ఒకింత సింపథీ కూడా వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే.. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ లీడర్ కావడం.. అనుభవజ్ఞుడు, నోరున్న నేత కావడంతో పాటు వైసీపీ ఎదురుగాలిలో కూడా 2019లో తమ కుటుంబం నుంచి పోటీ చేసిన ముగ్గురూ (ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు)  గెలవడం వల్ల కూడా టీడీపీలో అచ్చెన్న బలమైన నేతగా కనిపిస్తున్నారు.

సోదరుడు ఎర్రన్నాయుడి ఘనత ఇంకా ఆ కుటుంబానికి కలిసొస్తుండడం.. ఎర్రన్న కుమారుడు రామ్మోహననాయుడు ఎంపీగా పార్లమెంటులో ఎప్పుడై హైలైట్ అవుతుండడం... వైసీపీ పాలనలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఈ బాబాయ్ అబ్బాయిల హవా కొనసాగుతుండడం, ఆర్థికంగానూ బలంగా ఉండడంతో పార్టీ వైపు నిధుల కోసం చూడాల్సిన అవసరం లేకపోవడంతో చంద్రబాబు, లోకేశ్ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి అచ్చెన్నకు ఇచ్చేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో నిన్న అచ్చెన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడి సోదరుడు ఎర్రన్నాయుడు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఎర్రన్న, శివాజీలు అన్నదమ్ముల్లా పార్టీలో తిరిగేవారు. ప్రస్తుతం పార్టీలో, జిల్లాలో శివాజీ హవా తగ్గినప్పటికీ ఆయన్ను తన పెద్దన్న సమానుడిగా భావించి అచ్చెన్న ఆయన్ను ఈ సందర్భంగా కలిసినట్లు చెబుతున్నారు. అచ్చెన్నకు పార్టీ అధ్యక్ష పదవిని త్వరలో ప్రకటించబోతున్నారనడానికి ఇదే ఉదాహరణని చెబుతున్నారు.

కొసమెరుపు : ఏపీ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా ఒక వార్త వినిపిస్తోంది. అది.. మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం. కొద్ది నెలలుగా ఇది ప్రచారంలో ఉన్నా పార్టీ నుంచి ఇంతవరకు దీనిపై స్పష్టత ఏమీ రాలేదు. అయితే.. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు అదే జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అచ్చెన్నకు పార్టీ అధ్యక్ష పదవి కన్ఫర్మ్ కావడంతోనే ఆశీర్వాదం తీసుకున్నారని భావిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.