ఆరోగ్య శ్రీలో అనారోగ్యం.. ఏం జ‌రుగుతోందంటే!

సూత్రం లేని గాలిప‌టం మాదిరిగా త‌యారైన ప‌థ‌కం ఏదైనా ఉంటే.. అది ఆరోగ్య శ్రీనేన‌ని ఇటీవ‌ల ఓ ఉన్న‌తాధికారి నిష్క‌ర్ష‌గా త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. అంతెందుకు.. ప్ర‌స్తుతం టీటీడీ ఈవీగా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చ‌క్రం తిప్పారు. ఆయ‌నే ఈ ప‌థ‌కంపై నిట్టూర్పులు విడిచారు. ``ప‌థ‌కం మంచిదే.. చేసేవారు లేరు.. చూసేవారు లేరు!`` అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొన్నాళ్ల కింద‌ట క‌ల‌క‌లం రేపాయి. దీనికి కార‌ణం.. దీనిని మితిమీరిన ఓటుబ్యాంకు ప‌థ‌కంగా మ‌లుచుకోవ‌డ‌మే! దేంతో అయినా.. రాజ‌కీయం చేయొచ్చు.. కానీ, ఆరోగ్య సేవ‌ల‌తోనూ రాజ‌కీయం చేస్తున్న హిస్ట‌రీ.. జ‌గ‌న్ సంపాయించుకుంటున్నారు.

ఇప్పుడు అనూహ్యంగా ఈ విష‌యాన్ని ఎందుకు చ‌ర్చించాల్సి వ‌స్తోందంటే.. తాజాగా.. ఆరోగ్య శ్రీప‌థ‌కంలో 234 కొత్త సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో  ఈ పథకం కింద ఇప్పటి వరకు అందుతున్న 2,200 చికిత్సలు, సేవల సంఖ్య 2,434కు చేరింది. అదేవిధంగా అన్ని సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇంకేముంది.. వైసీపీ నాయ‌కుల‌కు ప్ర‌చారం చేసుకునేందుకు మ‌రో అంశం అందివ‌చ్చిన‌ట్ట‌యింది. అదేస‌మ‌యంలో ఆరోగ్య శ్రీ యాప్‌ను కూడా తీసుకువ‌చ్చారు. అంతా బాగానే ఉంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ఈ ప‌థ‌కం అమ‌లు తీరు ఎలా ఉంది? ఎంత మంది ల‌బ్ధిదారుల‌కు ఈ ప‌థ‌కం ప్రయోజ‌నం చేకూరుస్తోంది? అనే విష‌యాల‌పై మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ఈ ప‌థ‌కం నాసిర‌కంగా త‌యారై.. పేరు గొప్ప ఊరు దిబ్బ‌! అన్న చందంగా మారింద నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సేవ‌ల పెంపు క‌న్నా.. ఉన్న‌వాటిని ఎంత వ‌రకు అమ‌లు చేస్తున్నారు? అని ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో వేసిన ప్ర‌శ్న‌.. ఇప్ప‌టికీ స‌జీవంగా నే ఉంది.

ప్ర‌భుత్వాలు మారినా.. ఈ ప‌థ‌కం తీరు మాత్రం ఎక్క‌డా మార‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాధ‌నాన్ని భారీ ఎత్తున కుమ్మ‌రిస్తున్నామ‌ని చెబుతున్న స‌ర్కారు.. ఈ ప‌థ‌కంపై మానిట‌రింగ్ చేయ‌డంలో తీవ్ర అల‌స‌త్వంతో ఉంద‌నేది సీనియ‌ర్ అధికారుల మాట‌. ఒక‌రిద్ద‌రు నిజాయితీ ప‌రులైన అధికారులు ఎక్క‌డైనా త‌నిఖీలు చేస్తే.. వెంట‌నే ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్డ‌ర్లు వ‌చ్చేస్తున్నాయ‌ట‌!

ఆరోగ్య శ్రీకాంట్రాక్టులు, మందుల నిల్వ కేంద్రాలు, మందుల కొనుగోళ్ల నుంచి స‌ర్వం వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే సాగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పాత్రే ఎక్కువ‌గా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆస్ప‌త్రికి ఏం కావాల‌న్నా.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక‌, ప్ర‌జ‌లు కూడా నేరుగావెళ్లి.. ఈ ప‌థ‌కం కింద‌.. ల‌బ్ధి పొందాలంటే.. కుదిరే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని, ఎమ్మెల్యే సిఫార‌సులు ముఖ్యంగా ప‌నిచేస్తున్నాయ‌ని అంటున్నారు. ప‌థ‌కం మంచిదే.. అయినా.. ఓటు బ్యాంకు రాజ‌కీయం చేయ‌డంతో.. ఆరోగ్య శ్రీకే అనారోగ్యం చోటు చేసుకోవ‌డంతో ఇది చేటు ప‌థ‌కంగా మారిందే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌!!

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.