ఆ హైదరాబాదు సంపన్నుడు ప్రజలకు రూపాయి విదల్చడు

హైదరాబాద్ అన్నంతనే గుర్తుకు వచ్చే వారిలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉంటారు. నిజానికి ఆయన లేకుండా హైదరాబాద్ ప్రస్తావన ముగియదు. అధికారంలో ఎవరున్నా సరే వారితో సున్నం  పెట్టుకోకుండా (కిరణ్ కుమార్ రెడ్డిని మినహాయిస్తే) వారితో కలిసి జర్నీ చేసే అద్భుతమైన టాలెంట్ ఆయన సొంతం. మిగిలిన చోటు ఎక్కడైనా బావే కానీ.. పాతబస్తీలోని ఏడెనిమిది నియోజకవర్గాలకు మాత్రం రావద్దంటే రావొద్దని చెప్పటమే కాదు.. రాకుండా చేయటంలో అసద్ టాలెంట్ అంతా ఇంతా కాదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఏడు నియోజకవర్గాలు తన సొంత ఆస్తిగా ఫీలయ్యే మజ్లిస్ అధినేత.. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వంలో అయినా కీలకమనే చెప్పాలి. రాజకీయ నేతగా మాత్రమే సుపరిచితులైన ఓవైసీ సోదరులు.. ఆర్థికంగా కూడా సంపన్నులు. హైదరాబాద్ కు తిరుగులేని ఈ నవాబు సోదరుల్లో పెద్దోడు అసద్ కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం అంతా ఇంతా కాదు. వారిద్దరి మధ్య ఉన్న జానీ జిగిరి దోస్తానా చూసి కుళ్లుకునేటోళ్లు బోలెడంత మంది ఉంటారు. అయినప్పటికి వారి బంధానికి మాత్రం దిష్టి తగలకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.

2018 చివర్లో మధ్యంతరం కాని మధ్యంతరం ఎన్నికలకు వెళ్లిన సందర్భంగా లెక్కలు ఏదో తేడా వస్తున్నాయన్న భావన కలిగిన వెంటనే.. బుల్లెట్ వేసుకొని మరీ ప్రగతిభవన్ వద్దకు వెళ్లి.. సుదీర్ఘంగా మంతనాలు ఆడిన అసద్.. ప్రధాని మోడీని మాటలతో ఏదో ఒకటి అనేందుకు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోరు. అలాంటి అసద్.. తాజాగా తెలంగాణను భారీగా నష్టానికి గురి చేసిన భారీ వర్షాలు.. వరదలకు సాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరారు.

ఎప్పటిలానే.. కేంద్రం నుంచి సమాధానం లేని పరిస్థితి. ఇలాంటి వేళలో.. అసద్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. నిజమే.. అపదవేళలో సాయం చేయాల్సిన కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవటాన్ని తప్పు పట్టాల్సిందే. అదే సమయంలో నిద్ర లేచింది మొదలు హైదరాబాద్ నాది.. నాది..దాని వైపు చూడటానికి కూడా వీల్లేదని చెప్పే ఓవైసీ బ్రదర్స్.. హైదరాబాద్ కు ఇంత నష్టం వాటిల్లిన వేళలో.. తమ వంతుగా భారీ విరాళాన్ని ఎందుకు ప్రకటించనట్లు.

అందునా.. తమ జిగిరీ స్నేహితుడు కమ్ సీఎం కేసీఆర్ సాయం కోసం నోరు తెరిచి అడిగిన వెంటనే.. విరాళాల వర్షం కురిపించాలి కదా? హైదరాబాద్ నుంచి ఎంతో (పేరు ప్రఖ్యాతులు.. పవర్ వగైరా) తీసుకున్న ఓవైసీ బ్రదర్స్.. తిరిగి ఇవ్వరా? ఇవ్వాల్సిన బాధ్యత లేదంటారా?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.