చేవెళ్ల రోడ్డు యాక్సిడెంట్ వైరల్... భారీ ప్రాణనష్టం

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న వాహనం.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం ఏడు ప్రాణాల్ని బలి తీసుకుంది. షాకింగ్ గా మారిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని వారు మరణించారు. అయ్యో అనిపించేలా ఉన్న ఈ దారుణ ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని చూస్తే..

హైదరాబాద్ పాత బస్తీలోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఈ పదకొండుమందిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అక్కడి గుర్మిత్ కల్ కు వారు ప్రయాణమయ్యారు. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున ఇంటి బయలుదేరిన వారు చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద తమకు ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయారు.

అదే సమయంలో ఎదురుగా వస్తున్న బోర్ వెల్ లారీని ఢీ కొట్టింది.
అప్పటికే వేగంగా వాహనం ప్రయాణిస్తున్న నేపథ్యంలో బలంగా ఢీ కొట్టటంతో ఆరుగురు ఘటనాస్థలంలో మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వాహనంలో పదకొండుమంది ఉండగా.. వారిలో ఏడుగురు మరణించారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అనుకోని ఈ ప్రమాదం కారణంగా బీజాపూర్ జాతీయ రహదారి మీద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మరణించిన వారిని ఆసిఫ్ ఖాన్ (50).. సానియా(18), నజియా బేగం(45), హర్షద్(28), నజియా భాను(36), హర్షభాను(6), ఖలీద్‌ (43)లుగా గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ప్రాణాలు విడవగా.. మరొకరు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం షాక్ లో ఆ పిల్లాడు మునిగిపోయి.. బేల చూపులు చూస్తున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.