జనవరి 26 నాటికి జగన్ ఆ పనిచేసేస్తాడట !

తొందరలో రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటవ్వబోతున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అంటే ఈ లెక్కన మొత్తం 25 జిల్లాలు ఏర్పడతాయని అనుకున్నారు. అయితే అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పడిన సంక్షిష్ట పరిస్ధితుల కారణంగా జిల్లాల సంఖ్య 26కి పెరుగుతోంది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు స్ధానం చాలా పెద్దది.

ఈ నియోజకవర్గం విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా విస్తరించింది. పైగా పూర్తిగా గిరిజన ప్రాంతాల్లోనే విస్తరించి ఉంది. దీని వల్ల ఈ ఒక్క నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ముందుగా అనుకున్న సంఖ్యకు ఒకటి అదనంగా యాడ్ అవుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీ డిప్యుటి స్పీకర్ కోన రఘుపతి వివరించారు. 26 జిల్లాల నిర్ణయాన్ని రానున్న జనవరి 26వ తేదీన కానీ లేకపోతే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కానీ జగన్ ప్రకటించే అవకాశాలున్నట్లు కోన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలను 25కి పెంచబోతున్న విషయాన్ని తన పాదయాత్ర సందర్భంగా జగన్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రకటనకు అనుగుణంగానే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్ధాయి కమిటిని కూడా నియమించారు. ఈ కమిటి అనేక సమావేశాల తర్వాత క్షేత్రస్ధాయిలోని సమస్యలను, అనుకూలతలపై చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను అందించింది. దీని ప్రకారం 26 జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉందని జగన్ కు అర్ధమైంది.

జగన్ ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబునాయుడు చాలా స్పీడుగా  స్పందించిన విషయం తెలిసిందే.  ఈమధ్యనే పార్టీ కమిటిలను నియమించిన సమయంలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అందుకనే  25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో అధ్యక్షుడిని నియమించారు. వీళ్ళకు సాయంగా ఉంటుందని ప్రతి జిల్లాకు ఓ సమన్వయకర్తగా సీనియర్ నేతను నియమించిన విషయం అందరు చూసిందే. ఇక మిగిలిన పార్టీలైతే ఇంతవరకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. సరే ఏదేమైనా తొందరలోనే రాష్ట్రంలో అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటవ్వటం ఖాయమైపోయింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.